బాబుని కలిసిన బీజేపీ నేత.. ఏపీలో టీడీపీ గెలుపుపై నమ్మకంతోనేనా?

 

కేంద్రంలో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ పూర్తీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్ళీ కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసాయి. ఇక ఏపీలో వైసీపీదే గెలుపని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. అంతేకాదు.. మళ్ళీ మీరే రావాలి, మిమ్మల్ని సీఎంగా మరోసారి చూడాలని తన ఆకాంక్ష అని బాబుతో విష్ణు చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేసున్నారు. మరి ఇలాంటి సమయంలో బీజేపీ నేత.. చంద్రబాబుని కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పినా బీజేపీకి నమ్మకం లేదా? అందుకే మిగతా పార్టీ నేతలను దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా.. బీజేపీ పెద్దలు బాబు వద్దకి విష్ణుని రాయబారానికి పంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మని విష్ణు.. ఏపీలో టీడీపీనే గెలిచే అవకాశముందని నమ్ముతూ బాబుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విష్ణు.. బాబుని ఏ ఉద్దేశంతో కలిసారో ఆ పై వాడు విష్ణువుకే తెలియాలి.