ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను..!

 

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నిన్న ప్రొటెం స్పీకర్‌ గా ఎంఐఎం నేత,చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా ప్రారంభం రోజున బీజేపీ నుంచి ప్రాతినిధ్యం ఉండబోవడం లేదు. ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇవాళ్టి సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. ఎంఐఎం నేత ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ఆయన సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేయబోనని రాజాసింగ్‌ ఇదివరకే  ప్రకటించారు.

దీనిపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ఎంఐఎం సిద్ధాంతాలు వేరు, తమ సిద్ధాంతాలు వేరని..అందుకే ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేయబోనని రాజాసింగ్‌ తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక పూర్తయిన తర్వాత ఆయన సమక్షంలోనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఒకవేళ పూర్తిస్థాయి స్పీకర్‌గానూ ఎంఐఎం నేతే ఎన్నికైతే డిప్యూటీ స్పీకర్‌ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఈఅంశాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. రేపు స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది అనంతరం రాజాసింగ్ అసీంబ్లీ లో అడుగుపెట్టనున్నారు.