తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి గుండె విజయ రామారావు. తెలంగాణ మలి దశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, కేసీఆర్ తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తెలంగాణ రావాలని లేకుండేనని చెప్పారు.  ఉద్యమ ఒత్తిడితో సమైక్య ఆంధ్రలో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకున్నారని విజయరామారావు తెలిపారు. శాసనసభను నడవనీయకుండా అడ్డుకుని.. ఉద్యమం ఎగిసినట్టు చూపించి సమైక్య రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ అనుకున్నారంటూ కామెంట్ చేశారు. 

వరంగల్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న విజయరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ అజెండాలు అన్ని ఉత్తీత్తవేనని.. ఓట్లు దండుకోవడం కోసమేనని తెలిపారు. తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని, ఉద్యమకారులను గెంటి వేశారని విజయరామారావు అన్నారు. ఉద్యమంలో లేని కేటీఆర్.. ఉద్యమకారుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి ని చివరి నిమిషం వరకు నమ్మించి.. ఆ టికెట్ పై పోటీ చేసి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని విజయరామారావు ఆరోపించారు. 

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నవిషయం తెలియదా అని విజయరామారావు ప్రశ్నించారు. కేసీఆర్  ద్రోహం చేస్తేనే బాపురావు బిజెపి లో చేరారని చెప్పారు. పార్లమెంట్ లో మద్దతు లేకపోతే బిల్లు వచ్చేదా అని నిలదీశారు. అమెరికాలో కవితకు యాక్సిడెంట్ అయినా.. ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి  కేసీఆర్ అంగీకరించలేదన్నారు. కేసీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా కవితను తానే హైదరాబాద్ తీసుకువచ్చానని తెలిపారు. అప్పుడు కవిత ను రావద్దన్న కేసీఆర్.. తర్వాత జాగృతి పేరుతో ఉద్యమంలోకి ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. పివి ప్రతిష్టను వాదుకునేందుకే వాణిదేవీని ఎమ్మెల్సీ గా కేసీఆర్ నిలబెట్టారని విజయరామారావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ గల్లంతు అవుతుందన్నారు.