పోలవరం పై బీజేపీ నేత సుజనా స్పందన,పోలవరం ఒక కలగానే మిగలనుందా?

 

ఏపీ లో నిన్న మొన్నటిదాకా ఉత్కంఠంగా నడచిన అంశం పోలవరం. అసలు పొలవరం ఎప్పటికైనా పూర్తి అవుతుందా లేదా అనే అంశం పై ప్రజలు ఆశలు కూడా వదులుకుంటున్నారు అనడంలొ ఆశ్చర్యం లేదు. ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు కేంద్ర పెద్దల్ని కలిసి రావటమే కాక  పోలవరం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ను కలిసిన రాష్ట్ర నేతలు ప్రాజెక్టుపై చర్చించారు. అంతకుముందు పోలవరం పర్యటన ద్వారా తమ దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు పోలవరంపై నిర్దిష్టంగా బీజేపీ డిమాండ్ ఏంటి అన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపించటం లేదు. పోలవరం విషయంలో పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో డిమాండ్ చేస్తుండడంతో ఈ వ్యవహారంపై అసలు బీజేపీ ఏం కోరుకుంటోంది అనేది అర్థం కాకుండా తయారైంది. పోలవరంలో అవినీతి జరిగిందని గతం నుంచే బీజేపీ ఆరోపిస్తుంది.

టిడిపి అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు తీవ్ర స్థాయిలో పోలవరంపై ఆరోపణలు చేశారు. ఇక టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత కూడా బీజేపీ నేతలు అదే స్వరం వినిపించారు. పార్టీ అధ్యక్షుడు కన్నా కూడా పోలవరం పునరావాసంలో అక్రమాలు జరిగాయని ఒకటికి రెండు సార్లు ఆరోపించారు. అయితే ఈ అంశాల పై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ వివరణ ఇచ్చింది. పోలవరం నిర్మాణంలో అక్రమాల అంశాల్ని కేంద్రం పలు సందర్భాల్లో తోసిపుచ్చింది. పార్లమెంట్ లోనూ, బయట పోలవరం నిర్మాణ విషయంలో అవినీతి జరగలేదని స్వయంగా కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. అయినా ఇప్పుడు కేంద్ర పెద్దలను కలిసినా రాష్ట్ర  బీజేపీ నేతలు మళ్లీ అవినీతిపైనే ఫిర్యాదు చేశారు.అదే సమయంలో రివర్స్ టెండర్ల విషయంలో కూడా బీజేపీ ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. ఇప్పటికే రివర్స్ టెండర్ లకు సంబంధించి కేంద్రం అభ్యంతరం చెప్పింది. అయితే రివర్స్ టెండర్ లలో ఎనిమిది వందల కోట్ల ఆదా చేయవచ్చు అన్ని తీరుగా జగన్ సర్కార్ వెల్లడించింది.  బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి పోలవరం విషయంలో ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో అవినీతి అంటూ విచారణ చేపడితే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో గతాన్ని వదిలేసి ప్రాజెక్టుకు పూర్తిగా ఏం చర్యలు తీసుకోవాలో వాటిపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

నాటి ప్రభుత్వం పై ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలతో సుజనా విభేదిస్తున్నారు. అదిలా ఉంటే ఇప్పటికే కేంద్రం నుంచి పోలవరానికి ఆరు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల కావాల్సింది. గత రెండేళ్ల నుంచి మొత్తం పెరుగుతూ వస్తోంది. అయితే డీపీఆర్ 2 కు ఆమోదం వచ్చే వరకు ఈ నిధులు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు అని స్పష్టమవుతోంది. మొత్తంమీద పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ నేతల ఫిర్యాదులు తరువాత అసలు పోలవరానికి సంబంధించి కేంద్ర జల వనరుల శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరింత ఆసక్తికరంగా మారింది.