కేసీఆర్ ఖేల్ ఖతం అంటున్న బీజేపీ.. ఇది సీరియస్ గానేనా..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుండి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తిరుగు లేకుండా పోయింది. తనకు పోటీ వస్తుందనుకున్న టీడీపీ ని నామ రూపాలు లేకుండా చేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీ అగ్రనాయకులు మధ్య సయోధ్య తక్కువే. దీంతో తెలంగాణాలో కేసీఆర్ కు తిరుగు లేకుండా పోయింది. ఐతే తాజాగా బీజేపీ ముఖ్య నేత జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన సంచలన కామెంట్స్ తో రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపుతున్నాయి. ఈ కామెంట్స్ వెనుక బీజేపీ హై కమాండ్ ఉందా అని కూడా చర్చ జరుగుతోంది.

నిన్న బీజేపీ నిర్వహించిన జనసంవాద్ వర్చ్యువల్ ర్యాలీలో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా రాం మాధ‌వ్ చేసిన ఒకే ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ అయన ఏదో ఫ్లోలో ఆలా అన్నారా లేక ముందస్తుగా ఏమైనా హింట్ ఇస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇప్పటికే కరోనా తో సహా వివిధ అంశాల పైన టిఆర్ఎస్ బీజేపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇంతకూ రామ్ మాధవ్ ఏమన్నారంటే "ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి ఫ్రంటు లేదు టెంటు లేదు చివరికి హైదరాబాద్ లో ఒంటరిగా ఏకాకిగా కూర్చున్నారు. అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడుతూ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని" తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంటే కాకుండా "సగం సగం పూర్తైన కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప ఏడాది కాలంలో మీరు సాధించిన ప్రాజెక్ట్ ఒక్కటైనా ఉందా.. అసలు మీ ఏడాది పాలనా పై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే ధైర్యముందా " అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. "అవినీతి, అసమర్ధతకు మారుపేరుగా తెలంగాణ ప్రభుత్వం తయారైందని, చివరికి కరోనా పై పోరాటంలో కూడా ఫెయిల్ అయిందని అన్నారు. కరోనా కేసులపై మసిపూసి మారేడు కాయ చేసి కేంద్ర బృందాలను మోసం చేయగలరేమోగాని కరోనా బారిన పడ్డ రాష్ట్ర ప్రజలను ఎంత కాలం మోసం చేయగలరు" అని అయన కేసీఆర్ పై మండి పడ్డారు. కేంద్రం కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోకపోవడంతో కేసులు పెరిగాయన్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న తెలంగాణాలో రోజుకు కేవలం రెండు వేల పరీక్షలు చేస్తున్నా 15 వేలు పాజిటివ్ కేసులు తెలియని అన్నారు.