తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెదేపా,తెజస,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే మహాకూటమి,ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తెరాస నేతలు పలుమార్లు విమర్శలు గుప్పించారు.బీజేపీ కూడా అదే పంథా కొనసాగించే పనిలో పడింది.తాజాగా బీజేపీ నేత కిషన్‌రెడ్డి తెదేపాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికలకు వెళ్లడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.తెదేపా... కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని గుర్తు చేశారు. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాహుల్‌గాంధీకి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెదేపా తాకట్టు పెడుతోందని ఆరోపించారు.రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదని.. అధికారం కాపాడుకోవడం, కుర్చీని నిలుపుకోవడమే ఆయన లక్ష్యమన్నారు. నందమూరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నారా వారి తెలుగుదేశం పార్టీగా మారిందని ఆక్షేపించారు. మహాకూటమి చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని, కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తులన్నీ ఈ విషయాన్ని గుర్తించాలని కిషన్‌రెడ్డి అన్నారు.