పురందేశ్వరి రాజంపేట వెనుక చంద్రబాబు!

 

 

 

దగ్గుబాటి పురందేశ్వరిని కడప జిల్లా రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా బిజెపి పార్టీ ప్రకటించి౦ది. 2009 ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి ప్రాతినిధ్యం వహించిన పురందేశ్వరి, ఈ ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి టిక్కెట్ కావాలన్న షరతుపైనే బిజెపిలో చేరారు. అయితే విశాఖ లోక్‌సభ సీటు కంభంపాటి హరిబాబుకు దక్కడంతో విజయవాడ లేదా నర్సరావుపేట స్థానాల నుంచైనా పోటీ చేయడానికి సిద్దపడ్డారు. కానీ పురందేశ్వరికి అవికూడా కాకుండా రాజంపేట సీటును బిజెపి కేటాయించింది. అయితే పురందేశ్వరికి ఈ సీటు కేటాయించడం వెనుక టిడిపి అధినేత చంద్రబాబు ప్రభావం తీవ్రంగా వున్నట్లు తెలుస్తోంది.

 

వాస్తవానికి విశాఖను పురందేశ్వరికి ఇవ్వాలని ఓ దశలో పార్టీ పెద్దలు భావించారు. అయితే, టీడీపీ నేతలు బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెకు విశాఖ దక్కకుండా చేసినట్లు సమాచారం. ఆతరువాత ఆమెకి ఒంగోలు సీటును బీజేపీకి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. పురందేశ్వరి కోసమే ఆ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ ఆ సీటును వదులుకోవడానికి టీడీపీ సమ్మతించకపోవడంతో చివరకు బీజేపీకి దక్కిన నాలుగు స్థానాల్లోనే పురందేశ్వరికి సీటు సర్దుబాటు చేయాల్సి వచ్చింది.


ఒంగోలులో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డికి టిడిపి టిక్కెట్ ఇచ్చింది తప్ప, పురందేశ్వరికి మాత్రం అవకాశం కల్పించడానికి ఇష్టపడకపోవడం గమనించదగ్గ విశేషం. మరి విజయావకాశాలు తక్కువగా వుండే రాజంపేట నుంచి పురందేశ్వరి పోటి చేస్తారా? లేదా? అన్నది చూడాలి.