కమలం వైపే కన్ను... ప్రకాశం జిల్లాలో సైకిల్ దిగుతున్న తెలుగు తమ్ముళ్లు!

 

ప్రకాశం జిల్లాలో బిజెపి నేతలు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా టీడీపీ స్థానిక నేతలతో పాటు ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటే పార్టీకి పునాదులు పడతాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టిడిపి నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబుకు ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈదర హరిబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేత. 1994 లో టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఒంగోలు ఎమ్మెల్యేగా ఈదర హరిబాబు గెలుపొందారు. ఆ తరవాత ఓసారి ఇండిపెండెంట్ గా.. మరోసారి టీడీపీ టికెట్ పై ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో జడ్పీ చైర్మన్ గా ఈదర హరిబాబు పని చేశారు. ఆయన పదవీ కాలం 2019 జూలై 4 వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈదర హరిబాబు రాజకీయ అనుభవం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తున్నట్టు సమాచారం. ఒకరిద్దరు నేతలు ఈదర హరిబాబు నాయకత్వం పై అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఈదరకు బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, దగ్గుబాటి పురంధేశ్వరిలతో మంచి సంబంధాలు ఉండటంతో ఆయన నియామకం ఖాయమని క్యాడర్ చెప్పుకుంటున్నారు. టిడిపి నుంచి బిజెపిలోకి వలసలు కొనసాగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో కొంతమంది తెలుగు దేశం ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ నేతల్ని కలవడం చర్చనీయాంశమైంది. దీంతో టిడిపిలోని కీలక నేతలు పార్టీ వీడుతారనే ప్రచారం జోరందుకుంది.

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీకి వెళ్లేందుకు రంగం సిద్దమైందని ఈ నేపథ్యంలోనే బలరాంను సుజనా చౌదరి పిలిపించుకుని బిజెపిలోకొస్తే ప్రకాశం జిల్లా పగ్గాలు అప్పగిస్తామని కేంద్ర స్థాయిలో మంచి పదవి కూడా ఆఫర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని కరణం బలరాం చెబుతున్నారు. తాను టీడీపీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదని పార్టీ క్యాడర్ కు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ ఏ మేరకు ప్రకాశం జిల్లాలో ప్రకాసిస్తుందో వేచి చూడాలి.