రాజధానిపై బీజేపీ డబుల్ గేమ్.. పవన్ పరిస్థితి ఏంటి?

మూడు రాజధానుల అంశంపై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఓ వైపు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు.. మరోవైపు మండలిలో జగన్ సర్కార్ కి అండగా నిలబడ్డారు. ఈ పరిణామాలతో అసలు బీజేపీ స్టాండ్ ఏంటో అర్థంగాక... సామాన్యుల నుండి రాజకీయ విశ్లేషకులు వరకు తలలు పట్టుకుంటున్నారు.

రాజధాని విషయంలో మొదటి నుండి బీజేపీ నేతలు రోజుకో ప్రకటన చేస్తూ అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. ఒక నేత ఏమో రాజధానికి మేము వ్యతిరేకం అడ్డుకుంటాం అంటారు, ఒకరేమో మంచి నిర్ణయమే అంటారు.. ఇంకో నేతేమో రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. ఇలా ఒక్కో నేత ఒక్కో ప్రకటన చేస్తూ.. రాజధాని మార్పుకు బీజేపీ అనుకూలమో వ్యతిరేకమో అర్థంకాకుండా చేస్తున్నారు.

మరోవైపేమో, కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ దోస్త్ జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారు ఖండిస్తున్నారు. వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని, మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్రం సమ్మతి లేదని అంటున్నారు. అయితే వీరి మాటలకు, బీజేపీ చేతలకు అసలు పొంతన కుదరడం లేదు. మండలిలో బీజేపీ సభ్యుల తీరే దానికి నిదర్శనం.
 
మండలి లో బీజేపీకి సంబందించిన 3 సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి సహకరించారు. వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి వైసీపీతో కలిసి ఛైర్మెన్ పై ఒత్తిడి తెచ్చారు. రూల్ 71 పై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి, ప్రభుత్వ నిర్ణయానికి మేము వ్యతిరేకం అని చెప్పే అవకాశం ఉన్నా అది ఉపయోగించుకోలేదు. దీనిబట్టి చూస్తుంటే బీజేపీ మాటలకు, చేతలకు పొంతన లేదని అనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి బీజేపీ వ్యతిరేకమైతే.. మరి మండలిలో ఆ పార్టీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశమున్నా ఎందుకు ఉపయోగించుకోలేదు?. ఇదంతా చూస్తుంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గేమ్ లో పవన్ బలి అవుతున్నారా?.. అది ఆయనే ఆలోచించుకోవాలి.