బీజేపీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదా

 

సీమాంధ్ర తరపున పోరాడుతామని, మూజువాణి ఓటుకి ఒప్పుకోమని వాదించిన బీజేపీ నిన్న లోక్ సభలో బిల్లుని అడ్డుకొనే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకపాత్ర వహించి సహకరించింది. తెలంగాణాకు కట్టుబడి ఉన్నందునే బిల్లుకి మద్దతు ఇచ్చామని సమర్దించుకొంది. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) వంటి పార్టీలు సైతం బిల్లుని వ్యతిరేఖిస్తూ సభ నుండి వాకవుట్ చేసి నిరసన తెలుపగా, కనీసం బీజేపీ ఆపని కూడా చేయలేకపోయింది. కాంగ్రెస్-బీజేపీల బండారం బయటపడుతుందనే భయంతోనే సభలో తలుపులు, కిటికీలు మూయించి, లోక్ సభ ప్రసారాలు నిలిపివేయించి రెండు పార్టీలు కలిపి రహస్యంగా బిల్లుని ఆమోదింపజేసి ఉంటాయి. బహుశః గత రెండు మూడు రోజులుగా ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్నా చర్చలన్నీ ఈ వ్యూహం కోసమే తప్ప సవరణల కోసమో లేక బిల్లుకి మద్దతు కోసమో మాత్రం కాదనిపిస్తోంది.

 

కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యక్షంగా కపట నాటకాలు ఆడితే, బీజేపీ తెర వెనుక నిలబడి కనబడకుండా ఆడింది. కాంగ్రెస్ కత్తితో సీమాంధ్ర ప్రజల గొంతులు కొస్తే, బీజేపీ అంతకంటే దారుణంగా తడిగుడ్డతో వారి గొంతు నులుమింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొన్నపుడే సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టుకొని జూదం మొదలుపెట్టింది గనుక అందుకు అది పశ్చాతాపపడబోదు. ఎందుకంటే తెలంగాణాలో తెరాసని విలీనం చేసుకొని, 15 యంపీ సీట్లు సాధించి ఆ లోటుని అది భర్తీ చేసుకోగలదు. కానీ, బీజేపీ చేసిన పనివల్ల సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోవడమే కాక తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు చేతులు కలిపినప్పుడు అక్కడ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం.

 

సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్రంలో పర్యటించలేరని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేసిన నరేంద్ర మోడీ, ఇప్పుడు తను, తన అగ్ర నేతలు కూడా సీమాంధ్రలో కాలుపెట్టలేని దుస్థితి చేజేతులా కల్పించుకొన్నారు. నిన్నటి వరకు మోడీకి బ్రహ్మ రధం పట్టిన సీమాంధ్ర ప్రజలు, బీజేపీ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఫోటోలున్న బ్యానర్లను చింపి తగులబెట్టారు. ఆపార్టీ కార్యాలయాలపై దాడులు చేసారు.

 

సీమాంధ్ర ప్రజాగ్రహానికి గురయిన బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు తెలుగుదేశం పార్టీ కూడా నిరాకరించవచ్చును. తన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి సహకరించి బీజేపీ ఏమి బావుకొంటుందో తెలియదు కానీ ఎన్డీయే కూటమిని బలోపేతం చేయగల తెలుగుదేశం పార్టీ మద్దతుని, చంద్రబాబు సహకారాన్ని పోగొట్టుకోవడం తధ్యంగా కనిపిస్తోంది.