రాష్ట్రంపై మోడీ ప్రభావం ఉంటుందా?

 

దేశంలో మిగిలిన రాష్ట్రాలలో మోడీ ప్రభంజనం ఎంత బలంగా ఉన్నపటికీ, మన రాష్ట్రంలోమాత్రం అంతగా ప్రభావం చూపకపోవచ్చును. అందుకు కారణం సమైక్యాంధ్ర, తెలంగాణా సెంటిమెంట్లు బలంగా ఉండటమే.ఈ కారణంగా తెలంగాణాలో తెరాస, ఆంద్రాలో తెదేపా, వైకాపా, కొత్తపార్టీల ప్రభావమే అధికంగా ఉంటుంది. కానీ, బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తుందా లేదా? అనే అంశం రాష్ట్రంలో బీజేపీపై, తెదేపాతో పొత్తులపై తీవ్ర ప్రభావం చూపనుంది. నరేంద్ర మోడీ రాష్ట్రంపై ఏమేరకు ప్రభావం చూపగలరనేది కూడా దానినిబట్టే ఉంటుంది. ఒకవేళ రేపు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందినట్లయితే తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలు మరింత బలపడతాయి. ఆ రెండు పార్టీలు విలీనం లేదా పొత్తులకు కూడా అంగీకరించినట్లయితే ఇక వారిని ఎదుర్కోవడం ఎవరివల్ల కాదు.

 

తెదేపాకు తెలంగాణాలో బలమయిన క్యాడర్ ఉన్నపటికీ, ఒకవేళ బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే, తెదేపా కూడా బీజేపీని దూరం పెట్టే అవకాశం ఉంది. అందువల్ల తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చినప్పటికీ బీజేపీ తెలంగాణాలో పెద్దగా లబ్దిపొందలేదు. పైగా ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా బీజేపీ ఒంటరయిపోతుంది. కానీ, బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే తెలంగాణాలో నరేంద్ర మోడీ ప్రభావం కొంతమేర ఆ పార్టీకి లబ్ది చేకూర్చవచ్చును.

 

కానీ అదే కారణంగా బీజేపీని, మోడీని సీమాంధ్ర ప్రజలు వ్యతిరేఖించవచ్చును. ఒకవేళ మోడీ విజయావకాశాలను దృష్టిలో ఉంచుకొని తెదేపా దైర్యం చేసి బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నట్లయితే, అది కాంగ్రెస్, వైకాపా, కొత్త పార్టీలకు ఒక ఆయుధాన్ని అందిస్తుంది. కనుక తెదేపా బీజేపీతో పోత్తులకు అంగీకరించకపోవచ్చును. అదే జరిగితే, స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి సీమాంధ్రలో ప్రచారం చేసినా బీజేపీ ఒక్కసీటు కూడా గెలిచే అవకాశం ఉండబోదు.

 

అందువల్ల బీజేపీ తెలంగాణా వ్యవహారంలో కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించి తప్పుకోవచ్చును. అప్పుడు కాంగ్రెస్ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేసుకొంటే, తెలంగాణా బిల్లుకి పరోక్షంగా సహకరించామని తెలంగాణాలో, బిల్లుకి మద్దతు ఈయలేదని సీమాంధ్రలో చెప్పుకొని బీజేపీ తక్కువ నష్టంతో బయటపడవచ్చును. బిల్లుకి నేరుగా మద్దతు ఈయలేదు గనుక, తెదేపాకు కూడా బీజేపీతో పొత్తులకి అంగీకరించే అవకాశం ఉంది. అప్పుడు మోడీ ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది.