బీజేపీని చూస్తున్న హరికృష్ణ – అడ్డుపడుతున్న చంద్రబాబు


అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు. పాపం హరికృష్ణ ఇదే టైపులో ఆక్రోశిస్తున్నాడు. బావ టిక్కెట్ ఇవ్వడు.. వేరే పార్టీలో చేరనివ్వడు అని బాధపడుతున్నట్టు సమాచారం. హిందూపురం, పెనమలూరు, నూజివీడు టిక్కట్లని ఆశించిన హరికృష్ణకి చంద్రబాబు మొండి చెయ్యి చూపించాడు. ఒక దశలో మూడు నియోజవర్గాలలో ఎక్కడ నుంచైనా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని హరికృష్ణ భావించినప్పటికీ ఆ తర్వాత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న వెంటనే రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడ కూడా హరికృష్ణకి చంద్రబాబు నుంచి సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ మరో పార్టీలో చేరడం తెలుగుదేశానికి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం వుంది కాబట్టి హరికృష్ణని మీ పార్టీలో చేర్చుకోవద్దని బీజేపీ నాయకులకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. హరికృష్ణని రేపటి వరకు అదుపు చేస్తే, రేపటితో నామినేషన్లు ముగుస్తాయి కాబట్టి ఆ తర్వాత హరికృష్ణ శాంతించే అవకాశం వుందని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీలోకి చేర్చుకోమని చెప్పేయకుండా ఇష్యూని నాన్చమని బీజేపీ నాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం సంబంధాలలో నిమిషానికో మార్పు కనిపిస్తోంది. రెండు పార్టీలమధ్య పొత్తు వికటించిన పక్షంలో హరికృష్ణకి బీజేపీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే అవకాశం వుంది.