బీజేపీ లాగుడు ఎక్కువైంది!

 

తెలుగులో ఓ సామెత వుంది.. తెగేదాకా లాగొద్దని. మరి ఇటువంటి సామెత మరి హిందీలో ఉందో లేదేమో అనిపిస్తుంది బీజేపీ వ్యవహారం చూస్తుంటే. ఒకవేళ వుంటే, బీజేపీ అగ్ర నాయకత్వం ఈ సామెతని చదివి వుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయాన్ని తెగేదాకా లాగే ప్రయత్నం మానుకుని వుండేది. తెలుగు తెలిసిన వెంకయ్య నాయుడో, కిషన్‌రెడ్డో ఈ సామెత గురించి బీజేపీ కేంద్ర నాయకత్వానికి చెప్తే బాగుండేది. అసలు రాష్ట్రంలో బీజేపీకి ఏమైనా సీన్ వుందా? రాష్ట్రం ముక్కలు కావడానికి సపోర్ట్ ఇచ్చిన బీజేపీకి సీమాంధ్రలో అసలు సీన్ వుంటుందా? ఏదో దేశమంతటా మోడీ గాలి వీస్తోంది కాబట్టి, కాంగ్రెస్ పాలనను అంతం చేయాల్సిన చారిత్రక అవసరం వుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీకి స్నేహహస్తాన్ని చాచింది. అయితే ముద్దు చేసినప్పుడే చంకనెక్కాలని తెలియని బీజేపీ ఓవర్‌యాక్షన్‌తో ఇష్యూని తెగ లాగుతోంది. బీజేపీ ఇలా తెగేదాకా లాగితే అటు సీమాంధ్రతోపాటు ఇటు తెలంగాణలో కూడా బీజేపీ చెవిలో కమలం పెట్టుకోవాల్సి వస్తుంది.

 

తెలుగుదేశం బీజేపీని న్యాయంగానే సీట్లు ఆఫర్ ఇచ్చినా, తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్న బీజేపీ అగ్ర నాయకత్వం కూరగాయలు బేరమాడినట్టు వ్యవహరిస్తోంది. మెట్టు దిగకుండా బెట్టు చేస్తోంది. అగ్ర నాయకత్వం జిడ్డు ధోరణి వల్ల అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో బీజేపీ నాయకులు దిగులు పెట్టేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే, టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ రెండు మూడు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సిందే. ఆ విషయం తెలిసి కూడా అగ్ర నాయకత్వం చేస్తున్న నకరాలని ఎలా అర్థం చేసుకోవాలో అర్థంకాక వారందరూ డిప్రెషన్‌లో పడిపోతున్నారు. పార్టీ నాయకత్వానికి త్వరగా జ్ఞానోదయం కలిగాలని, తెలుగుదేశానికి, బీజేపీకి త్వరగా పొత్తు కుదరాలని తమ పార్టీ దైవమైన రాముడికి దణ్ణాలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఇచ్చిపుచ్చకునే ధోరణితో వ్యవహరించకపోతే ఈసారి ఎన్నికలలో ఆ పార్టీ తూర్పు తిరిగి దణ్ణం పెట్టాల్సివస్తుందని రాజకీయ పరిశీకులు అంటున్నారు.