బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఈయదు: అద్వానీ



బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ మద్దతు కోరేందుకు తనను కలిసిన తెదేపా తెలంగాణా నేతలతో మాట్లాడుతూ, “నా 40 సం.ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ కూడా పార్లమెంటులో ఇంత దారుణమయిన పరిస్థితులు చూడలేదు. అందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టవలసి ఉంటుంది. ఇటువంటి లోపభూయిష్టమయిన బిల్లుకి బీజేపీ మద్దతు ఇవ్వలేదు. రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి రాగానే బిల్లులో లోపాలనట్టినీ సరిచేసి మేమే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తాము,” అని చెప్పారు.

 

మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీకి న్యాయశాఖ చెప్పేవరకు కూడా ఆ బిల్లుని రాజ్యసభలో పెట్టకూడదని తెలియదంటే నమ్మలేము. దానికి తెలంగాణా ఏర్పాటుపై చిత్తశుద్ది లేనందునే ఇటువని నాటకాలు ఆడుతోంది. చివరికి మా పార్టీపై నెపం పెట్టి తప్పుకోవాలని చూస్తోందని” అన్నారు.

 

ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత రవిశంకర్ ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా బిల్లుపై కాంగ్రెస్ ఏవిధంగా నాటకమాడుతోందో వివరించి చెప్పారు. “ఆ పార్టీకి నిజంగా తెలంగాణా ఏర్పాటు పట్ల చిత్తశుద్ది లేదు. అందుకే ఉభయసభలలో కొందరు కాంగ్రెస్ యంపీలు విభజనకు అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేఖంగా ఆందోళన చేస్తున్నా వారిని అదుపు చేయకుండా చోద్యం చూస్తోంది. ఆవిధంగా చేయడం ద్వారా సభలో బిల్లుని ఆమోదించడానికి తాము చాలా చిత్తశుద్ధితో వ్యవహరించామని తెలంగాణా ప్రజలకు, రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొన్నామని సీమాంధ్ర ప్రజలకు నమ్మబలికి రెండు చోట్ల ఓట్లు దండుకోవాలని చూస్తోంది. అందుకే తనకు అత్యంత విధేయులయిన యంపీలే బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా ఆందోళన చేస్తూ సభని స్థంభింపజేస్తున్నప్పటికీ అది చోద్యం చూస్తూ కూర్చొంది. పార్లమెంటు సమావేశాలు మొదలయ్యి నేటికి అప్పుడే వారం రోజులయియినా ఉభయ సభలు ఒక్కరోజు కూడా నిర్వహించలేని పరిస్థితి స్వయంగా కాంగ్రెస్ కల్పించింది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల మీద నిందవేసి తప్పుకోనేందుకే కాంగ్రెస్ ఈ నాటకమంతా ఆడుతోందని మేము భావిస్తున్నాము. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేనప్పుడు అందుకు ఇతరులను నిందించడం చాలా తప్పు,” అని అన్నారు.