దిద్దుబాటు చర్యలలో కమల నాధులు

 

మోడీని వ్యతిరేఖిస్తూ అద్వానీ అస్త్ర సన్యాసం చేసిన తరువాత తలెత్తిన రాజకీయ పరిణామాలను చూసి ఉలిక్కి పడిన కమలనాథులు ఆ ఊబి లోంచి బయటపడేందుకు ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతున్న మోడీయే స్వయంగా అద్వానీని కలిసి మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు పార్టీలో తనకు మద్దతు ఇచ్చేవారిని వ్యతిరేకించేవారిని కూడా కలుస్తూ పరిస్థితులను తనకనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు ఆరంబించారు. అద్వానీని కలిసి పార్టీకి ఆయన మార్గదర్శనం అవసరమంటూ నచ్చజెప్పి ఆయన చేత తనకు, పార్టీకి అనుకూలంగా ఎలాగయినా ఒక ప్రకటన చేయించి విమర్శకుల నోర్లు మూయించాలన్నది మోడీ యోచన. పనిలోపనిగా మోడీ పార్టీ ప్రధాన కార్యకర్తలతో కూడా భేటీ అయ్యి రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో విజయం సాదించేందుకు ఏవిధంగా ముందుకు సాగాలనే విషయంపై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.

 

మరో పక్క రాజ్ నాథ్ సింగ్ కూడా పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై ఆయన పార్టీ ముఖ్య నేతలతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా విమర్శకులకు సమాధానాలు చెప్పే పనిలో పడ్డారు. పార్టీ అంతర్గత సమస్యలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబు ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో 2002 లో జరిగిన దురదృష్టకర సంఘటనలను పదే పదే ఎత్తి చూపిస్తూ బీజేపీని నిందిస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.

 

కాంగ్రెస్ దేశాభివృద్ధిని నిర్లక్ష్యం చేసి, కుంభ కోణాలలో అగ్రగామిగా నిలుస్తోందని ఆయన ఎద్దేవా చేసారు. మతతత్వ పార్టీగా తమపై ముద్ర వేస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలలోనే ఎక్కువ మత కలహాలు చెలరేగుతున్నాయని ఆయన అన్నారు. గుజరాత్ లో గత 10 పదేళ్ళు గా తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కర్ఫ్యూ లు, బంద్ లు జరగలేదని ఆయన అన్నారు. గత 10 ఏళ్లలో గుజరాత్ లో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడమని ఆయన కాంగ్రెస్ పార్టీకి హితువు పలికారు.

 

తమ పార్టీ అభివృద్దే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్ మాత్రం కుంభకోణాలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగిపోతోందని ఆయన ఎద్దేవా చేసారు. తమ పార్టీ పరమత సహనం కలదని ఆయన అన్నారు. ఉదాహరణకి గోవా రాష్ట్రంలో 30 శాతానికి పైగా క్యాథలిక్ లున్నారని, అక్కడ తమ ప్రభుత్వంలో 8 మంది శాసన సభ్యులు క్యాథలికులేనని ఆయన గుర్తు చేశారు.

 

తమ ప్రభుత్వ హయాంలో ఉన్న రాష్ట్రాలలో వ్యవసాయరంగ వృద్ధిరేటు 18 శాతం కాగా ,కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలలో అది 1.96 శాతానికి పడిపోయిందన్నారు. మంత్రి వర్గ విస్తరణతో కేవలం కాంగ్రెస్ విస్తరణే తప్ప పరిపాలనకు కానీ, దేశాభివృద్ధికి అది ఏవిధంగాను దోహదపడదని ఆయన తేల్చి చెప్పారు.