సొంత జిల్లాలో ధర్మానకు తీరని అవమానం..!

ధర్మాన ప్రసాదరావు. ఏ పార్టీలో ఉన్నా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయననే పెద్దదిక్కుగా చెప్పుకుంటారు. అలాంటి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ అధికారంలోకి వచ్చాక, మంత్రి పదవి ఆశించి భంగపడ్డాక, ఎమ్మెల్యేగానే మిలిగిపోయారు. అయితే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ధర్మాన... తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారనే వార్తలు, ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో నాలుగు వర్గాలున్నాయి. అందులో మూడు వర్గాలు అధికార వైసీపీకి మద్దతు తెలుపుతుండగా, మిగిలిన ఆ ఒక్క వర్గం మాత్రం టీడీపీకి మద్దతు తెలుపుతోంది. అయితే, ఆ ఒక్క వర్గాన్నీ తమవైపు తిప్పికోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశాయి. అయితే, వర్తక సంఘంలో తమ ఆధిపత్యం నడవాలంటే అన్ని వర్గాలు తమవే అయ్యుండాలని చోటా నాయకులు ధర్మానకు నూరిపోశారు. దాంతో ధర్మాన సైతం తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారట. అయితే, ఇది, అధికార పార్టీకి మద్దతుగా ఉన్న వర్తకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ఇటీవల శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో ధర్మాన వర్గం, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇది బహిర్గతమైంది. ధర్మాన అనుకూల వర్గం నిర్వహించిన రక్తదాన శిబిరంలో కేవలం 20మంది మాత్రమే పాల్గొనగా, ఆయన వ్యతిరేక వ్యాపార వర్తక సంఘం నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం, 200మందికి పైగా పాల్గొన్నారు. దాంతో, ధర్మాన ప్రసాదరావుకు ఇది తీవ్ర అవమానమన్న చర్చ శ్రీకాకుళంలో జరుగుతోంది.

శత్రువుల్లో కూడా సానుభూతిపరులను దగ్గర చేసుకునే ధర్మాన, ఈసారి మాత్రం ఆ లాజిక్ మిస్సయ్యారని అంటున్నారు. సొంత పార్టీలో ఉన్నవారినే కాదు, వైరి పక్షాల్లో ఉన్న సానుభూతిపరులను కూడా దగ్గర చేర్చుకోవడమే ధర్మాన గెలుపు మంత్రమని చెప్పుకుంటారు. ప్రధానంగా 2004, 2009, 2019 ఎన్నికల్లో ఇటువంటి అంశాలే ధర్మాన విజయానికి సూత్రమని చెప్పుకుంటారు. అలాంటి ధర్మాన... మార్కెట్ వర్తక సంఘం వ్యవహారంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారని చర్చించుకుంటున్నారు. అయితే, అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుని, ధర్మాన పలుచన అవుతున్నారని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎంత బలవంతుడైనా, అనువుగాని చోట అధికులమనరాదన్న మాటను, ధర్మాన మరచిపోయారని పార్టీ నేతలు అంటున్నారట. ఓవరాల్ గా వర్తక సంఘంలో అనుకున్నది ఒక్కటైతే, జరిగింది మరొకటని అంటున్నారు. మరి, ఈ మార్కెట్ అవమానం నుంచి ధర్మాన ఎలా బయటపడతారో చూడాలంటున్నారు.