లైఫ్ సైన్సెస్‌లో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం: కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ మంత్రిగా చాలా వినూత్నంగా దూసుకుపోతున్నారు. రేపటి కోసం నేడు అనే కాన్సెప్ట్ తో హెచ్ఐసీసీ వేదికగా బయో ఏషియా 2020 సదస్సును మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు 37 దేశాలకు చెందిన 2000 మంది ప్రతి నిధులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సెయిన్జిన్ బయోటెక్ రీసెర్చి సెంటర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ను హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నామని కేటీఆర్ వివరించారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని... తెలిపారు మంత్రి కేటీఆర్.

దేశంలోని 35 శాతం మెడిసిన్స్ హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్నాయని వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 800 ఫార్మా కంపెనీలున్నాయని.. త్వరలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలు హైదరాబాద్ కు తరలివస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు రేపు కూడా కొనసాగనున్న ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న మార్పులపై చర్చించనున్నారు. ఈ రంగాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలపై దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.