పార్టీలో చిచ్చుపెట్టిన జాబితా

 

ఇన్నాళ్లు అభ్యర్థుల జాబితా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన నాయకులు ఇప్పుడు జాబితా ప్రకటనతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం. నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.తాండూరు టికెట్ పైలట్ రోహిత్‌ రెడ్డికి కేటాయించటంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు.దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖరాశారు. తాండూరు నియోజకవర్గంలో తాను బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని,స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు సోనియా గాంధీతో, మీతో కలిసి పనిచేసిన అనుభవం ఉందని లేఖలో పేర్కొన్నారు.ఆరు దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు.

మరోవైపు శేరిలింగంపల్లి నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించుకోవాలని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కోరారు.ఆ స్థానం తనకు కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా తెదేపాకు కేటాయించారని,అయితే తాను ఇప్పటికే అధిష్టానం సూచన మేరకు నెల రోజులుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నానని ఆయన చెప్పారు.గతంలో రాహుల్‌గాంధీ బహిరంగ సభకు తానెంతో కృషి చేశానని ఆయన తెలిపారు.కాగా భవిష్యత్తు కార్యచరణపై మసీదు బండాలోని తన నివాసంలో అనుచరులతో భిక్షపతి యాదవ్‌ సమావేశమయ్యారు.