ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం కానీ పెన్షన్ ఉండదు.. జగన్ హామీలో షరతులు!

 

ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టు బట్టిన వాళ్లు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. అధికారులుకు జీతాలు బాగా తగ్గడంతో పాటు మొత్తం సిబ్బందికి పెన్షన్ ఉండదని చెబుతుండడమే ప్రధాన కారణాలు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆర్టీసీకి 52,000  మంది సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి నేతృత్వంలోని కమిటీ సెప్టెంబర్ లో ఇచ్చిన నివేదికలో ఆర్టీసీని విలీనం చేయటం సాధ్యం కాదనడంతో సిబ్బంది వరకు విలీనం చేయాలని సీఎం జగన్ సూచించారు. ఆ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. డిసెంబర్ లోపే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ప్రజా రవాణా శాఖలోకి 52,000 ల మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. విధి విధానాలు రూపొందించి సిబ్బందిని విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. విధి విధానాల రూపకల్పనలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జీతాలు చాలా తగ్గించాలని కమిటీలోని కొందరు సభ్యులు సూచించినట్టు తెలిసింది. ప్రిన్సిపల్ సెక్రెటరీ కన్నా ఆర్టీసీ ఈడీలకు ఎక్కువ జీతాలున్నాయని.. జిల్లా కలెక్టర్ల కన్నా రీజియన్ మేనేజర్ లకు వేతనాలు అధికమని తేలింది.

వచ్చే జనవరి నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రభుత్వంలో విలీనం అవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ ఈడీ, ఆర్ఎం, డీఎం లకు హోదాలకు అనుగుణంగా జీతాలు నిర్ణయించాలని కమిటీ సూచించినట్టు ఆర్టీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలవెన్సులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలనే చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే పెన్షన్ ఆర్టీసీ నుంచి విలీనమయ్యేవాళ్లకు వర్తించదని జీపీఎఫ్ ఇస్తే ఆర్థిక భారం ప్రభుత్వం పై ఎక్కువగా పడుతోందని అవసరమైతే సీపీఎఫ్ కి అవకాశమిద్దాం తప్ప జీపీఎఫ్ వద్దే వద్దని కమిటీ సభ్యుల పేర్కొన్నట్లు తెలుస్తోంది.

పెన్షన్ ఉండబోదన్న వార్తలు కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. అదే లేకపోతే తమకు విలీనం వల్ల కలిగే లాభం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి జీవిత చరమాంకంలో కనీస పెన్షన్ భద్రత లేకుంటే ఎలా అంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వంలో విలీనమయ్యారు. రవాణా సంస్థలను అక్కడి ప్రభుత్వాలే నిర్వహిస్తూ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అహ్మదాబాద్, ముంబై, పూనె,తానే, షోలాపూర్ తదితర చోట్ల స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ లు నిర్వహిస్తున్నందున అక్కడ పెన్షన్ చెల్లించడం లేదు. దీన్నే కమిటీ అధికారులు ప్రస్తావిస్తున్నారు.