రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ డబుల్ గేమ్

 

‘రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరుగదు’ అనే వాదన దగ్గర నుండి ‘ఎన్నికల వరకు జరుగదనే’ వాదనకి దిగిరావడంతోనే రాష్ట్ర విభజన అనివార్యమని తేటతెల్లమవుతోంది. అంటే సీమంద్రా నేతలు రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడటమే కాకుండా ప్రజలను కూడా అందుకు సిద్దపరుస్తున్నారని అర్ధమవుతోంది. అయితే ఎన్నికల వరకయినా ఈ ప్రక్రియ వాయిదాపడాలని వారు కోరుకోవడం చూస్తే, రాష్ట్ర విభజన కంటే తమ రాజకీయ భవిష్యత్ పట్ల వారు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది.

 

కనీసం ఎన్నికల వరకు విభజన జరుగకుండా ఆపగలిగితే, ఎలాగో కష్టపడి మళ్ళీ ఎన్నికలలో గెలవచ్చుననే దురాలోచనే వారిలో కనబడుతోంది. అయితే వారు మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీని తిడుతున్నారు. పార్టీలు మారుతున్నారు. కొత్త పార్టీ పెడతామంటున్నారు. అయితే ఎన్నికల వరకు విభజనను ఆపినంత మాత్రాన్న సీమాంధ్ర ప్రజలు ఓట్లు వేస్తారని అనుకోలేము.

 

కానీ వారు మాత్రం అధిష్టానాన్ని ఒప్పించి ఎన్నికల వరకు విభజన ప్రక్రియను నెమ్మదించగలిగితే ఈలోగా ప్రజలకు ఏదో మాయమాటలు చెప్పయినా మళ్ళీ తమకే ఓట్లు వేయించుకోగాలమనే ధీమా సీమాంద్ర కాంగ్రెస్ నేతలలో బలంగా ఉంది. అందుకే వారు ‘తల్లీ నీకు మొక్కెద! దయతలచి విభజన ప్రక్రియకు కాస్త బ్రేకులేయవే’ అంటూ అధిష్టానాన్ని వేడుకొంటున్నారు.

 

ఒకప్పుడు అడుగు ముందుకు వేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తామని బెదిరించే స్థాయి నుండి నేడు కాస్త బ్రేకులేస్తే చాలాని కాళ్ళ బేరానికి వచ్చిన సీమాంధ్ర నేతలని చూసి అధిష్టానం జాలిపడినట్లుంది. బహుశః అందుకేనేమో “రాష్ట్రవిభజన ఎన్నికల ముందే జరుగుతుందో లేక తరువాతే జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని” చాక్లెట్ వంటి తీయని మాట చాకో చేత పలికింపజేసింది.

 

అయితే మళ్ళీ అదే సమయంలో అటు తెలంగాణా ప్రజలకి తమ శీలం మీద అనుమానం కలుగకూడదనే ఆలోచనతో వెంటనే దిగ్విజయ్ సింగ్ “చాకో అన్నమాటలకి నేను జవాబు దారీ కాబోను. రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరిగి తీరుతుంది,” అని మరో కత్తి లాంటి ప్రకటన చేసేసి చేతులు దులుపుకొన్నారు.

 

ఎన్నికలలోగా రాష్ట్రాన్ని కత్తిరించేయాలా వద్దా అనే సంగతి మాత్రం రాష్ట్రంలో పరిస్థితులని బట్టి నిర్ణయించుకొని ముందుకు సాగవచ్చును. విభజిస్తే సీమంద్రా కాంగ్రెస్ నేతలు పోతారు. కానీ వారికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందే చేసుకొంది గనుక వారి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ విభజించకపోయినట్లయితే, తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకుపోతే, ఆనక తెరాస ఏకుమేకయి కూర్చొనే ప్రమాదం ఉంది. గనుక విభజనకే మొగ్గు చూపవచ్చును.

 

కానీ ఎన్నికలకి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది, గనుక ఇది సాంకేతికంగా సాధ్యపడుతుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న.