బీసీసీఐని కరుణించిన సుప్రీం

ఎట్టకేలకు బీసీసీఐని సుప్రీం కరుణించింది. నిధుల విడుదలపై విధించిన ఆంక్షలను తొలగించేలా ఆదేశాలివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం బీసీసీఐకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకోలేదు.. ఈ నేపథ్యంలో నిధుల విడుదలపై విధించిన ఆంక్షలను తొలగించాలని లేదంటే ఇంగ్లాండ్-భారత్ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వస్తుందని కోర్టుకు విన్నవించుకుంది. దీనిని పరిగణలోనికి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. వెంటనే రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌కు రూ.58.66 లక్షలు విడుదల చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే రాజ్‌కోట్ టెస్ట్ జరగనుంది.