2024 వరకు ఉండనిస్తారా?.. సుప్రీం తీర్పుపై ఆధారపడనున్న గంగూలీ భవిష్యత్తు

 

బీసీసీఐ బాస్ గా సౌరవ్ గంగూలీ స్పెషల్ గా నిలుస్తున్నాడు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గానూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే డే అండ్ నైట్ టెస్టు నిర్వహణలో మంచి మార్కులు కొట్టేశాడు సౌరవ్. అదే ఊపులో లోధా సంస్కరణల మార్పుపై కూడా ఫోకస్ పెట్టాడు. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఏజీఎం సమావేశం జరిగింది. గంగూలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ క్రికెట్ సలహాదారుల కమిటీ ఐసీసీలో బోర్డు ప్రతినిధి నియామకం వంటి కీలకాంశాలపై చర్చ జరిగింది. లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. దీనిని సుప్రీంకోర్టు ఆమోదించాల్సి ఉంది. 

సుప్రీం కోర్టు కూడా ఆమోదిస్తే బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో వున్న ఆఫీస్ బేరర్ మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఉండదు. క్యాబ్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు పని చేసిన గంగూలి 9 నెలల్లో బీసీసీఐ అధ్యక్ష పదవిని విడిచిపెట్టాల్సిన అవసరముండదు. అంటే గంగూలి 2024 వరకు బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశముంటుంది. 

గంగూలీతో పాటు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగే వీలుంటుంది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు బీసీసీఐ ప్రతినిధిగా జైష హాజరు కానున్నారు. సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసిందని బీసీసీఐ ప్రకటించింది. పాత నిబంధనల ప్రకారమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యం లోని సెలెక్షన్ ప్యానెల్ పదవీ కాలం ఫినిష్ అయిందని ఏజీయం తర్వాత గంగూలీ చెప్పాడు. బీసీసీఐ పాలనలో అడుగడుగునా అడ్డంకిగా మారుతున్న లోధా సంస్కరణలకు దాదా చెక్ పెట్టేలా ముందుకు వెళ్తున్నాడు. బీసీసీఐ బాస్ గా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. బీసీసీఐ ఇమేజ్ ను పెంచాలనే పట్టుదలతో ఉన్నాడు.