బీబీసీ కాదు.. ఛీఛీఛీ...

 

బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (బీబీసీ) మాట తప్పింది. నిర్భయ ఘటన మీద రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయబోమని భారత ప్రభుత్వానికి ఇచ్చిన మాట తప్పింది. ఇండియాలో వెల్లువెత్తిన నిరసనను, ప్రసారం చేయవద్దన్న ప్రభుత్వ అభ్యర్థనను పక్కనపెట్టి నిర్భయ ఘటన మీద రూపొందించిన డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయడం పట్ల భారత ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. బీబీసీ వార్తా సంస్థ బుధవారం రాత్రి తమ దేశంలో ‘ఇండియాస్ డాటర్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అనంతరం యూట్యూబ్‌లో వుంచింది. భారత ప్రభుత్వం దీనిమీద తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోను వెంటనే యూ ట్యూబ్ నుంచి తొలగించాలని కోరింది. ఇది చాలా సున్నితమైన అంశం కావడం వల్ల వెంటనే ఈ వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం యూట్యూబ్ సంస్థను కూడా కోరినట్టు తెలుస్తోంది. అయితే భారత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని, సమాచారం అందిన వెంటనే సదరు వీడియోను తొలగిస్తామని యూట్యూబ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు బీబీసీకి నోటీసులు జారీ చేశారు. నిర్భయ ఘటన డాక్యుమెంటరీ విషయంలో ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడినందుకు బీబీసీ వార్తాసంస్థకు నోటీసులు జారీ చేశామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బీబీసీ వార్తాసంస్థకు నోటీసులు జారీ చేసింది.