బీజేపీ ఎంపీ సుజనాకు మరోషాక్.. 400 కోట్ల ఆస్తుల వేలానికి బ్యాంకు ప్రకటన

అప్పుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆస్తుల వేలానికి బ్యాంకుల నోటీసుల పర్వం కొనసాగుతోంది. సుజనా గ్రూపు సంస్ధ అయిన హైదరాబాద్ లోని సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్ధ గతంలో తీసుకున్న 400 కోట్ల రూపాయల అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం ప్రకటన జారీ చేసింది. అప్పులను రాబట్టుకునేందుకు వచ్చే నెల 23న సంస్ధకు చెందిన పలు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపింది.

టీడీపీని వీడి బీజేపీలో చేరినా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి సమస్యలు తప్పడం లేదు. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ సంస్ధలు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకులు వేలం ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ ద్వారా పలు బ్యాంకులు సుజనా గ్రూప్ సంస్ధలకు వేలం నోటీసులు పంపగా.. తాజాగా హైదరాబాద్ లోని సుజనా గ్రూప్ సంస్ధ మెసర్స్ సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ సంస్ధ గతంలో తీసుకున్న 400 కోట్ల అప్పుల రికవరీకి గానూ సంస్ధకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు వీలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఇందులో రుణం తీసుకున్నందుకు గ్యారంటెర్లుగా ఉన్న ఎంపీ సుజనా చౌదరితో పాటు వై. జితిన్ కుమార్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్స్ట్స్ లిమిటెడ్, సుజనా క్యాపిటల్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్ తో పాటు మరికొందరి పేర్లను ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.. ఇప్పటికే సీబీఐ నుంచి వివిధ బ్యాంకులకు చెందిన రుణాల ఎగవేత కేసుల్లో నోటీసులు అందుకున్న సుజనా గ్రూప్ సంస్ధలకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది.

వాస్తవానికి మోడీ తొలిసారి ప్రధాని అయ్యాక టీడీపీ కోటాలో కేంద్రమంత్రిగా వ్యవవహరించిన సుజనా చౌదరి పదవిలో ఉండగానే ఆరోపణలు మొదలయ్యాయి. ఆ తర్వాత సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతకు సంబంధించి ఆస్తుల వేలం నోటీసులు కూడా ఇచ్చింది. ఇందులో విదేశీ బ్యాంకుల రుణాలు కూడ ఉన్న నేపథ్యంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉన్న సుజనా చౌదరిపై చర్యలకు వెనుకాడిన సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్దలు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడంతో సుజనాపై కేసుల విషయంలో జోరు పెంచాయి. ఆ తర్వాత వరుసగా సుజనా గ్రూపు సంస్ధల్లో సోదాలు కూడా జరిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత సుజనా మరో ముగ్గురు ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావుతో కలిసి బీజేపీలో చేరిపోయారు. రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఏ క్షణాన్నైనా సుజనాను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం కూడా అప్పట్లో ఉండేది. వాటి నుంచి బయటపడేందుకే సుజనా బీజేపీని ఆశ్రయించారని అంతా భావించారు. కానీ తాజా వేలం ప్రకటనలను బట్టి చూస్తే ఆ పరిస్ధితి లేదని అర్ధమవుతోంది. సుజనా బీజేపీ ఎంపీ అయినప్పటికీ బ్యాంకులు మాత్రం ఆర్ధిక మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు, ఒత్తిడి మేరకు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.