గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యలపై బండ్ల స్పందన

 

తెలంగాణలో కూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటా అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు టీఆర్ఎస్ కి పట్టం కట్టారు. దీంతో బండ్ల కోసం మీడియా వెతుకులాట మొదలెట్టింది. ఎక్కడా బండ్ల కనిపించిన దాఖలు లేవు. ఫలితాలపై మాట్లాడింది లేదు. ఎట్టకేలకు తాజాగా ఆయన తన వ్యాఖ్యలపై స్పందించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన బండ్ల గణేష్ అక్కడ మీడియాతో మాట్లాడారు.

'అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు. నేనేం అజ్ఞాతంలో లేను. మేము ఊహించని విధంగా మా పార్టీ ఓడిపోయింది కాబట్టి మానసికంగా బాధతో ఉన్నాం. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాంలే.. ప్రజలు మనల్ని తిరస్కరించారు. కాబట్టి మనం మౌనంగా ఉండాలి. మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని ఊరుకున్నా' అని చెప్పుకొచ్చారు. నేటి ఓటమే రేపటి విజయానికి పునాది అని బండ్ల అనటం కొస మెరుపు. గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యల గురించి మీడియా ప్రస్తావించగా.. ‘‘కోపంలో చాలా మంది చాలా అంటారు. అవన్నీ అవుతాయా? మా పార్టీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి అలా అన్నాను. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది.’’ అని బదులిచ్చారు.