అధికారుల నిర్లక్ష్యం..రోడ్డుపై బ్యాలెట్‌ బాక్స్‌

 

తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో నిన్న ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌ ని స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ బ్యాలెట్‌ బాక్స్‌ రోడ్డుపై పడి ఉండడం చర్చనీయాంశమైంది. రాజస్థాన్ లో  కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని షాహబాద్‌ ప్రాంతంలో గత రాత్రి ఈ ఘటన జరిగింది. రహదారిపై ఉన్న బ్యాలెట్‌ యూనిట్‌ను పోలీసులు పరిశీలించారు. ఎన్నికల సంఘం సీల్‌ వేసి ఉండడంతో ఈవీఎంలను వాహనాల్లో తరలించేటప్పుడు పడిపోయి ఉంటుందని భావించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్‌ రఫీక్‌, నవల్‌ సింగ్‌ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. తర్వాత ఆ బ్యాలెట్‌ను పోలీసులు కిషన్‌గంజ్‌లో మిగతా ఈవీఎంలు నిల్వ ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. రాజస్థాన్‌ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 72.7 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. అల్వార్‌ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్‌ సింగ్‌ మరణించడంతో అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు.