‘లెజెండ్’ ఆపేస్తే ‘సాక్షి’ని మూసేయాలి!

 

 

 

నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ఓటర్ల మీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా ఎన్నిక కమిషన్ చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ కోరింది. ఇది తెలుగుదేశం వర్గాలకి ఆగ్రహం తెప్పిస్తోంది. జగన్ పార్టీ తెచ్చిన ఈ ప్రస్తావనని ఒక పనికిమాలిన ప్రస్తావన అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.


ఎన్నికలలో పాల్గొంటున్న వారి సినిమాలను దూరదర్శన్‌లో ప్రదర్శించరాదని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. సినిమా థియేటర్లలో, ప్రైవేట్ చానెళ్ళలో ప్రదర్శించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆ అంశం తమ పరిధిలో లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే అన్నీ తెలిసికూడా ఏదో ఇష్యూ క్రియేట్ చేద్దామనే జగన్ పార్టీ ‘లెజెండ్’ సినిమాని వేలెత్తి చూపిస్తోందని తెలుగుదేశం వర్గాలు జగన్ పార్టీని విమర్శిస్తున్నాయి.



జగన్ పార్టీ కోరినట్టు ‘లెజెండ్’ సినిమా నిలిపేయడానికి తాము సిద్ధమని, అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా జగన్ పేరు ఊదరగొట్టే సాక్షి ఛానల్‌ని, జగన్ భజనలో తరించిపోయే ‘సాక్షి’ పేపర్ని జగన్ మూసేస్తారా?  అని అంటున్నారు. జగన్ ‘సాక్షి’ని మూసేయడానికి సిద్ధమైతే, తాము ‘లెజెండ్’ ప్రదర్శన నిలిపేయడానికి సిద్ధమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.