తెలంగాణ రాజకీయాల్లో బాలకృష్ణ హస్తం

 

గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పనున్నారని వార్తలు వస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో నందమూరి కుటుంబానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీటీడీపీ నేతలను బాలయ్యను ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.ఈ నెల 24 నుంచి మహాకూటమి తరపున బాలయ్య ప్రచారం చేయబోతున్నారు.అంతేకాకుండా తనతో సినిమా తీసిన ప్రముఖ నిర్మాత,వ్యాపారవేత్త భవ్య ఆనంద్ ప్రసాద్ ని శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేయటంలో కూడా బాలయ్య కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి మరీ ఆనంద్ ప్రసాద్‌కు టికెట్ ఇప్పించారని ప్రచారం జరుగుతోంది. ఆనంద్ ప్రసాద్‌ను గెలిపించే బాధ్యతలు కూడా బాలయ్య తీసుకున్నట్లు వినికిడి.

మరోవైపు నందమూరి హరికృష్ణ కూతురు.. నందమూరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే సుహాసిని చంద్రబాబుతో సంప్రదింపులు జరిపారు.కూకట్‌పల్లి నుంచి సుహాసిని అభ్యర్ధిత్వం ఖాయమైతే ఆమె విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బాలయ్య తన అన్న కూతురి గెలుపుకోసం ప్రచారం చేసే అవకాశం ఉంది.ఇప్పటికే బాలయ్య ఖమ్మం జిల్లాలో ప్రచారం చేసి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపారు.ఇప్పుడు మహాకూటమి తరుపున బాలయ్య ప్రచారం చేయబోతున్నారు.మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో నందమూరి కుటుంబం తమదైన ముద్ర వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.