తెదేపా బీజేపీతో మళ్ళీ స్నేహగీతం ఆలపిస్తుందా

 

నరేంద్ర మోడీ మూడవసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేస్తున్నపుడు ఆయన తేదేపాకు కూడా ఆహ్వానపత్రం పంపారు. అప్పుడు బాలకృష్ణ బయలుదేరేందుకు సిద్దపడితే చంద్రబాబు వారించడంతో ఆయన ఆగిపోయారు. అయితే, నిన్నమోడీ హైదరాబాదులో జరిగిన సభకు బయలుదేరక మునుపు, ఇతర సినీ ప్రముఖులతో బాటు నందమూరి బాలకృష్ణ కూడా వెళ్లి మోడీని కలవడం గమనిస్తే, చంద్రబాబు తన మనసు మార్చుకొన్నట్లు అర్ధం అవుతోంది.

 

బాలకృష్ణ మోడీని పార్క్ హయత్ హోటల్లో కలిసి వచ్చిన తరువాత, మోడీ తన సభలో ప్రసంగిస్తూ తెదేపాను స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవం కోసం ఆయన కాంగ్రెస్ తో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికే ఆయన తెదేపాను స్థాపించాడని, అందువల్ల తెదేపా ఆయన అడుగుజాడలలో నడిచి తన నిబద్దతను చాటుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే ఆయనకు ఘనమయిన నివాళి అర్పించినట్లవుతుందని అని పలికి తెదేపా సెంటిమెంట్ ని కదిపారు. అయితే, ఆయన యన్టీఆర్ పొగిడినంత మాత్రాన్న తెదేపా ఆయనతో పోత్తులకు సిద్దపడిపోదని మోడీకి తెలుసు. కానీ, ఆయన తన ప్రయత్నం తను చేసారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇంచుమించు అదే విధంగా జవాబిచ్చారు.

 

తెదేపా ఇప్పటికిప్పుడు బీజేపీతో పొత్తులకి సిద్దపడకపోయినా, ఎన్నికలలోగా మళ్ళీ బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనే అవకాశం ఉంది. ఇక రెండు రోజుల క్రితమే తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ బీజేపీతో పొత్తుల గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పడం చూస్తే, ఆ ఆలోచన ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ తెరాసతో, వైకాపాతో పొత్తులు లేదా విలీనాలకి సిద్దపడితే, అప్పుడు తెదేపా కూడా తప్పని పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులకు అంగీకరించక తప్పదు. లేకుంటే ఆ పార్టీ తెలంగాణాలో తీవ్రంగా నష్టపోవడం ఖాయం. అదేవిధంగా తెదేపా కాంగ్రెస్-తెరాస-మజ్లిస్ కూటమికి ఎదురునిలిచి తెలంగాణా రాష్ట్రంలో పట్టు సాధించాలంటే తప్పనిసరిగా బీజేపీతో చేతులు కలపక తప్పదు. లేకుంటే తెదేపా వారి ధాటికి తట్టుకొని నిలబడటం చాలా కష్టం అవుతుంది.

 

తెదేపా తెలంగాణా ప్రాంతంలో బీజేపీ సహాయం పొందే ప్రయత్నం చేస్తే, బీజేపీ సీమంధ్ర ప్రాంతం తెదేపా సహాయం తీసుకొనే అవకాశముంది. ఒకవేళ రానున్న ఎన్నికలలో బీజేపీ గనుక కేంద్ర ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితికి చేరుకొంటే, అప్పుడు ఆ పార్టీకి తెదేపా వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు చాల అవసరముంటుంది.

 

ఇక ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో రెండు చోట్ల తన పార్టీని నడపాలని భావిస్తున్న తెదేపా అందుకు వీలుగా తప్పనిసరిగా తమపార్టీకి జాతీయ పార్టీ హోదా పొందవలసి ఉంటుంది. ఒకసారి తెదేపా జాతీయ హోదా పొందిన తరువాత చంద్రబాబు కూడా అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, గనుక బీజేపీతో చేతులు కలపవచ్చును.