బస్సులో బాలయ్య ..లోకేష్

 

వచ్చేనెల 24నుండి చంద్రబాబు మళ్ళీ రాష్ట్ర పర్యటనకి బయలుదేరబోతున్నారు. అయితే ఆరోగ్యరీత్యా ఈసారి బస్సులో పర్యటించాలని నిర్ణయించుకొన్నారు. ఆయన పాదయాత్రకి వచ్చిన అపూర్వ స్పందన చూసిన తరువాత బాలయ్య బాబు, లోకేష్ ఇద్దరూ కూడా అటువంటి యాత్రలపట్ల మనసు పారేసుకొన్నట్లు తెలుస్తోంది.అయితే, చంద్రబాబులా వారు పాదయత్రకి సిద్దపడకపోయినా బస్సుయాత్ర మాత్రం తప్పనిసరిగా చేయాలని నిర్ణయించుకొన్నారు.

 

లోకేష్ వీలయితే తన తండ్రితో కలిసి లేదా త్వరలోనే వేరే బస్సులో తన పర్యటన మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఇక, బాలకృష్ణ కూడా తను ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో మొదలుపెట్టిన సినిమా పూర్తవగానే బస్సు యాత్ర మొదలుపెడతానని చెప్పారు. ఈ సినిమా పూర్తవడానికి కనీసం మూడు లేదా నాలుగు నెలలు పట్టవచ్చును. అంటే నవంబర్ నాటికి బాలకృష్ణ ఖాళీ అవుతారు. అప్పటికి సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడినా వెలువడవచ్చును. లేకున్నపటికీ, ఇక అప్పటి నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తిగా పార్టీ కోసమే తన సమయం కేటాయించాలని ఆయన భావిస్తున్నారు.

 

ఈసారి ఆయన కృష్ణా జిల్లా నుండి పోటీ చేయబోతున్నారు గనుక, ముందుగా శ్రీకాకుళం లేదా అనంతపురం నుండి యాత్ర మొదలుపెట్టి ఆఖరుగా కృష్ణా జిల్లాలో యాత్ర చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బస్సు యాత్ర చేయడం దాదాపు ఖరారయినప్పటికీ, రోడ్డు మ్యాప్ మాత్రం అప్పుడే ఖరారు చేయవచ్చును.

 

ఇక మరో ఆసక్తి కరమయిన వార్త ఏమిటంటే, త్వరలోనే తెదేపా కూడా ఒక స్వంత చానెల్ ఏర్పాటు చేసుకోబోతున్నట్లు సమాచారం. లోకేష్ ఆ పని మీదనే ఇటీవల డిల్లీ కూడా వెళ్లి వచ్చాడని సమాచారం. అయితే, ఈ విషయం తెదేపాలో ఎవరూ ధృవీకరించలేదు.