సరిహద్దులు నిర్దారణకొరకు భద్రాచలం వచ్చిన కేంద్ర బృందం

 

ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆసక్తికరమయిన వార్త వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర అధికారుల బృందం ఒకటి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల నిర్ధారణ నిమిత్తం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌కు వచ్చి అక్కడ సరిహద్దులను నిర్దారించుకొనట్లు ప్రచురించింది. భద్రాచలం డివిజన్‌న్ను తెలంగాణ నుండి తప్పించి, దానికి సమీపంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు వీలుగా స్థానిక అధికారుల సహాయంతో సరిహద్దుల మార్పులకి అవసరమయిన వివరాలను వారు సిద్దం చేసుకొంటున్నట్లు సమాచారం. ఈ సంగతిని ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి దృష్టికి తీసుకు వెళ్ళగా, తనకు కనీసం మాట మాత్రంగా చెప్పకుండా కేంద్రం అధికారుల బృందాన్ని పంపడాన్నిఆమె నిరసన తెలియజేసారని ఆ పత్రికలోవార్త వచ్చింది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను ఎట్టి పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో కలపకుండా అడ్డుకొనేందుకు ఆమె సూచన మేరకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి ప్రయాణమవుతున్నట్లు తెలిసింది. కేంద్రం ఇంకా విభజన ప్రక్రియ మొదలు పెట్టక ముందే ఇంత వేగంగా కేంద్ర బృందం రంగంలోకి దిగడం విశేషమే. ఇదే నిజమయితే, కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు నాలుగు నెలలోనే విభజన ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలదేమో.