అక్కాచెల్లెళ్ళది ఆత్మహత్యే...

 

ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్ గ్రామంలో ఐదు నెలల క్రితం ఇద్దరు టీనేజ్ అక్కా చెల్లెళ్ళు ఆ గ్రామంలోని ఓ చెట్టుకు ఉరి వేసి కనిపించారు. ఈ ఇద్దరినీ ఎవరో మానభంగం చేసి, ఉరివేసి చంపారన్న వార్తలు దేశమంతటా వినిపించాయి. ఈ విషయం మీద గత ఐదు నెలలుగా సీబీఐ విచారణ జరుపుతోంది. మొత్తానికి గురువారం నాడు తన విచారణ వివరాలను వెల్లడించింది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళను ఎవరూ హత్య చేయలేదు. మానభంగం చేయలేదు. వీరిద్దరూ ఆ చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మీద అత్యాచారం చేసి హత్య చేశారనడానికి తమకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని సీబీఐ పేర్కొంది. సీబీఐ ఈ విచారణ వివరాలను స్థానిక కోర్టులో అందజేయనుంది. సీబీఐ విచారణ వివరాలు వెల్లడి కావడంతో ఇప్పటి వరకూ ఇద్దరు అక్కాచెల్లెళ్లను మానభంగం చేసి హత్య చేశారంటూ బయల్దేరిన ఊహాగానాలకు తెరపడే అవకాశం వుంది. ఈ కేసు విషయంలో అనుమానితులుగా అరెస్టు చేసిన ఐదుగురు యువకులను కూడా విడుదల చేసే అవకాశం వుంది.