ఏపీ, తెలంగాణ వామపక్ష సారధులకు అగ్నిపరీక్ష... జాతీయ నాయకత్వం హెచ్చరిక

 

అందరి పొలాల్లోనూ మొలకలు వస్తున్నాయి. కానీ, వాళ్ల పొలాల్లో మాత్రం మొలకలు రావడం లేదు. పైగా వేసిన విత్తనాలు సైతం ఎండిపోతున్నాయి. దాంతో, మళ్లీ పంట వేయాలో వద్దో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఒకవేళ విత్తనాలు చల్లినా ఏం ఉపయోగం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు పడిన కష్టానికి ఒకటో అరో ప్రతిఫలం దక్కేది... ఇఫ్పుడు అది కూడా లేకపోవడంతో ముందుకెలా వెళ్లాలో అస్సలు పాలుపోవడం లేదు వాళ్లకు. ఇంతకీ వాళ్లెవరో కాదు... ఏపీ, తెలంగాణ వామపక్ష సారధులు. ఇక, పంటా... విత్తనాలంటే... ఓట్లూ సీట్లే... ఒకప్పుడు... వామపక్షాలకు తెలుగు రాష్ట్రాల్లో అంతోఇంతో పట్టుండేది. ఒంటరిగా పోటీ చేసినా... ఏదైనా ప్రధాన పార్టీతో కలిసి పోటీ చేసినా... కనీసం ఒకటో రెండో సీట్లు వచ్చేవి. అసెంబ్లీలో ప్రాతినిథ్యమన్నా దక్కేది. కానీ, ఇప్పుడు వామపక్షాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.

ఏపీ, తెలంగాణలో సీపీఐ, సీపీఎంకు అస్సలు ప్రాతినిధ్యమే లేదు. ముఖ్యంగా అంతోఇంతో పట్టున్న తెలంగాణలో సైతం వామపక్షాలకు చేదు ఫలితాలే దక్కాయి. దాంతో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వామపక్షాలకు పట్టు ఉండేది. ఎంత తక్కువ లేదన్నా... ఒకట్రెండు సీట్లు గెలిచి అసెంబ్లీలో ప్రజాగళం వినిపించేవారు. 2014 ఎన్నికల వరకు ఇది కొనసాగింది. ఆ తర్వాత వామపక్షాల గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. పట్టున్న ప్రాంతాల్లో సైతం ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం... పైగా చోటామోటా నేతలతోపాటు పేరున్న లీడర్ల కూడా ఇతర పార్టీల్లో చేరిపోవడంతో వామపక్షాల పరిస్థితి మరింత దిగజారింది. దాంతో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకే వెనుకాడుతున్నారట. 

అయితే, ఏపీ, తెలంగాణ వామపక్ష సారధుల పనితీరుపై జాతీయ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందట. పూర్వవైభవం కోసం ప్రయత్నించాలని, ప్రజాసమ్యలపై పోరాడాలని హెచ్చరించిందట. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, కనీసం వామపక్షాలకు పట్టున్న ప్రాంతాల్లోనైనా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఉనికిని చాటుకోకపోతే మాత్రం రాష్ట్ర సారధులను మార్చే అవకాశముందని అంటున్నారు. దాంతో, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు సీపీఐ, సీపీఎం కార్యదర్శులకు అగ్నిపరీక్షగా మారాయనే టాక్ వినిపిస్తోంది. అయితే, ప్రతి పోరాటంలోనూ ముందుండే వామపక్షాలు... ప్రజల మద్దతును కూడగట్టడంలో మాత్రం విఫలమవుతున్నాయి. పట్టున్న ప్రాంతాల్లో సైతం ఉనికిని కోల్పోతున్నాయి. మరి, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనైనా తామున్నామని నిరూపించుకుంటాయో లేదో చూడాలి.