డేటింగ్ కపుల్ ఛీటింగ్.. 11.5కోట్లతో జల్సాలు..

వాళ్లిద్దరు మహా కిలాడీలు. కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. అతడు ఐపీఎస్ ఆఫీసర్ గా బిల్డప్ కొట్టాడు. ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌గా ఫోజు కొట్టింది. ఇద్దరూ కలిసి ఓ బకరాను పెళ్లి పేరుతో మోసం చేశారు. ఏకంగా 11.5 కోట్లు కాజేశారు. ఈజీ మనీని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 40 లక్షలు కట్టి 40 రోజుల పాటు ఓ హోటల్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. 2 కోట్ల బీఎమ్ డబ్ల్యూ కారులో షికార్లు చేశారు. మరో ఐదు కార్లతో హంగామా చేశారు. ఖరీదైన విల్లా, భారీగా బంగారు ఆభరణాలు.. అబ్బో ఓ రేంజ్ లో సాగింది వారి యవ్వారం. కట్ చేస్తే.. ఆ డేటింగ్ కపుల్ లో విజయ్ కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. అతని పార్ట్ నర్ శిరీష అలియాస్ స్మృతి సింహ కటకటాలు లెక్కపెడుతోంది. 

సంచలనంగా మారిన బాచుపల్లి మోసం కేసులో పోలీసు విచారణతో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. కడప ప్రాంతానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి పి.వీరారెడ్డి (36) బాచుపల్లిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ అంటిల్లా విల్లా నంబర్‌ 268లో నివాసం ఉంటున్నారు. పక్క విల్లాలో ఉంటున్న అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి వీరారెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. తాను ఐపీఎ్‌సకు ఎంపికయ్యానని, తన భార్య శ్రుతి సిన్హా మానవ హక్కుల కమిషన్‌ దక్షిణ భారత విభాగానికి చైర్మన్‌ అని. తన తండ్రి రాఘవ రెడ్డి డీసీపీ అని.. తమకు 77 బస్సులున్నాయని, 32 ఎకరాల పొలం ఉందని వీరారెడ్డికి అబద్ధాలు చెప్పాడు. వీరారెడ్డి తన తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకుని.. తమకు తెలిసిన ప్రవల్లిక అనే అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వీరారెడ్డి ఆమెతో మాట్లాడుతానని అడగ్గా.. శ్రుతిసిన్హాతో ఫోన్‌లో మాట్లాడించాడు. 

నిజానికి వారిద్దరూ భార్యాభర్తలు కారు. వృత్తి రీత్యా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ అయిన విజయ్‌కుమార్‌ రెడ్డి.. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటూ బోరబండలో సూపర్‌మార్కెట్‌ నిర్వహిస్తున్న శ్రుతి సిన్హాతో సహజీవనం చేసేవాడు. విజయ్‌కుమార్‌ రెడ్డి, శ్రుతి సిన్హాలు వీరారెడ్డిని 2017 నుంచి మోసం చేస్తూ వచ్చారు. రకరకాలుగా నమ్మిస్తూ లక్షల్లో వసూలు చేశారు. నాలుగేళ్లలో మొత్తం 11.50 కోట్లు  వసూలు చేశారు. 

రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడంతో వీరారెడ్డికి అనుమానం వచ్చి విజయ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రాడూన్‌లోని పోలీసు అకాడమీలో ఉన్నానని చెప్పాడు. వాట్సప్‌లో లైవ్‌ లొకేషన్‌ పంపించాలంటూ వీరారెడ్డి అడిగాడు. అప్పటికే పలుమార్లు సమాధానం చెప్పలేక తప్పించుకుంటూ వచ్చిన విజయ్ కుమార్ రెడ్డి ఇక మరింత కాలం వీరారెడ్డిని మేనేజ్ చేయడం ఆయన వల్ల కాలేదు. విలాసాలపై శ్రుతి మోజు మరింతగా పెరగడం, వీరారెడ్డి నుంచి డబ్బు కోసం ఒత్తిడి పెరుగుతుండడంతో విజయ్‌కుమార్‌ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారెడ్డి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన విజయ్‌కుమార్‌రెడ్డి బంధువులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.