పిల్లల ఆహారంలో విషం

ఇంట్లో పిల్లవాడు ఉంటే గారాబంగా చూసుకుంటాం. వాడి చిన్ని పొట్ట ఆకలితో ఉందన్న అనుమానం రాగానే... కడుపు నిండా ఆహారం పెడతాము. కానీ ఆ ఆహారంలో విషం ఉందని తెలిస్తే! అవును! పిల్లలకి అందించే ఆహారంలో ఆర్సెనిక్ (పాషాణం) అనే ప్రాణాంతక రసాయనం ఉంటోందని చెబుతున్నారు ఐర్లాండ్ పరిశోధకులు.

 

ఓ అర్నెళ్లు వచ్చిన పిల్లలకి పాలతో పాటుగా ఘనాహారం కూడా పెడుతుంటాము. అందుకోసం గోధుమలు, బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ తరహా ఆహారాన్ని ‘ఫార్ములా ఫుడ్స్’ అంటారు. అయితే ఈ ఫార్ములా ఫుడ్స్లో ప్రాణాంతమైన ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటోందని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. అందుకే జనవరి 2016లో పిల్లల ఆహారంలో ఆర్సెనిక్ అదుపులో ఉండాలంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.

 

యూరోపియన్ యూనియన్ చేసిన హెచ్చరికలు ఎంతవరకు పనిచేస్తున్నాయో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఇప్పటికీ ఓ 50 శాతం బేబీ ఫుడ్స్లో ఆర్సెనిక్ మోతాదుకి మించి ఉంటోందని తేలింది. బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది. బియ్యంతో చేసిన ఫార్ములా ఫుడ్స్లో దాదాపు 75 శాతం సందర్భాలలో విచ్చలవిడిగా ఆర్సెనిక్ కనిపించింది. బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్ సురక్షితం అని మన నమ్మకం. అవి పిల్లలకి సులభంగా జీర్ణమవుతాయనీ, ఎలాంటి అలెర్జీలూ రావని, పోషకాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతాము. కానీ అవే బియ్యపు ఆహారంలో ఆర్సెనిక్ శాతం ఎక్కువగా కనిపించడం బాధాకరం.

 

ఇంతకీ ఈ ఆర్సెనిక్ ఎక్కడి నుంచి వస్తోంది? అంటే స్పష్టమైన కారణం కనిపిస్తుంది. పంటని పండించేటప్పుడు చల్లే పురుగుమందులు, దాన్ని నిల్వ చేసేటప్పుడు వాడే క్రిమిసంహారక మందులు... అన్నింటిలోనూ ఆర్సెనిక్ పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. ఇక భూమి, నీరు, గాలి కాలుష్యం కావడం వల్ల కూడా ధాన్యపుకంకుల్లోకి ఆర్సెనిక్ చేరే ప్రమాదం ఉంది.

 

ఎంతటివారికైనా ఆర్సెనిక్ ప్రమాదకరమే! ఇక పసిపిల్లలకైతే ఇది విషంతో సమానం. ఆర్సెనిక్ వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, తెలివి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, నరాల బలహీనత.... వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. వారి శరీరంలో భాగాలన్నీ చురుగ్గా ఎదుగుతున్న సందర్భంలో ఆర్సెనిక్ శాపంగా మారవచ్చు. పెద్దల బరువుతో పోల్చుకుంటే పిల్లలు, తాము తినాల్సినదానికంటే ఎక్కువ ఆహారాన్నే తింటారు. కాబట్టి వారి శరీరంలో ఆర్సెనిక్ కూడా ఎక్కువగా చేరుతుందన్నమాట.

 

దురదృష్టం ఏమిటంటే... బేబీ ఫుడ్స్ని ఉత్పత్తి చేసే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వీటిలోని ఆర్సెనిక్ 85 శాతం తగ్గిపోయే అవకాశం ఉందట. దీన్నిబట్టి బేబీఫుడ్స్ కంపెనీలు ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతోంది. అందుకని ఇక మీదట హెచ్చరికలు చేసి ఉపయోగం లేదనీ... ప్రతి బేబీఫుడ్ ప్యాకెట్ మీదా అందులో ఆర్సెనిక్ శాతం ఎంత ఉందో తెలిపేలా ఒక చట్టం చేయాలని పరిశోధకులు కోరుతున్నారు. దీనివల్ల వినియోగదారులే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.

- నిర్జర.