జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా? చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

జగన్మోహన్‌రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన 41ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచక, అనాగరిక పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. వైఎస్ హయాంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి టైమ్ లో కేవలం ఒకే ఒక్క జిల్లాకు హింస పరిమితమైతే, ఇప్పుడు రాష్ట్రమంతటా రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. దాడులు, కేసులు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం... ఇలా వంద రోజుల్లోనే వందలకొద్దీ దౌర్జన్యాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ఒక్క అమరావతిలోనే టీడీపీ నేతలపై 38 అట్రాసిటీ కేసులు పెట్టారన్న చంద్రబాబు... ఈ వంద రోజుల్లోనే తెలుగుదేశం శ్రేణులపై 565 కేసులు, 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు, 21మంది ఉద్యోగుల తొలగింపు, 15 భూకబ్జాలు, 65 ఆస్తుల ధ్వంసం, 10 హత్యలు, 28 చొప్పున 28 పర్సనల్ అండ్ సోషల్ మీడియా కేసులు పెట్టగా, వైసీపీ వేధింపులు భరించలేక 8మంది ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే గుంటూరు జిల్లాలో 500మందిని గ్రామాల నుంచి తరిమికొట్టారని లెక్కలతో సహా బాబు బయటపెట్టారు. ఇక పోలీసులు సైతం టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నారని, తెలుగుదేశం వాళ్ల ఫిర్యాదులను తీసుకోవడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రజలు తమ సొంత ఇళ్లల్లో ఉండటానికి పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. దాడులు, అక్రమ కేసులే కాకుండా తోటలు, ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, ఇంతటి రాక్షస పాలనను తానెప్పుడూ చూడలేదని అన్నారు. రాక్షసుల గురించి వినడమే గానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని, వైసీపీ నేతలు... రాక్షసులను మరిపిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

వైసీపీ నేతలు పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదని చంద్రబాబు ఫైరయ్యారు. అమ్మాయిని వివస్త్రను చేసి కారం చల్లుతారా? 545మందిని గ్రామాల నుంచి వెలేస్తే చిన్న సమస్యా? బాధితులను పెయిడ్ ఆర్టిస్టులంటారా? అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? అంటూ బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, తమకు అడ్డే లేదు... ఏమైనా చేస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ వైసీపీ దౌర్జన్యాలు ఇక సాగనివ్వబోమంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదిఏమైనా ఛలో ఆత్మకూరు ఆగదని, ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని బాబు తేల్చిచెప్పారు.