బాబా రామ్ దేవ్ ట్వీట్ వెనుక మర్మమేమిటి ?

అంతర్జాతీయ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా చైనాను బహిష్కరించాలని బాబా రాందేవ్ పిలుపునివ్వడం వెనుక ఆంతర్యమేమిటని దౌత్యవేత్తలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ, యోగా వరకే పరిమితమైన బాబా రాందేవ్ , ఈ రోజు హఠాత్తుగా దౌత్య వ్యవహారాలను ప్రభావితం చేసే విధంగా, చైనా మీద మాటల దాడికి దిగటం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.  " దీనికోసం భారత దేశం దౌత్యపరంగా చొరవ తీసుకోవాల," ని రాందేవ్ డిమాండ్ చేయటం అంతర్జాతీయ సమాజాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయ పరంగా, లేదా దౌత్య పరంగా...దేశ ప్రధాని తరఫున విదేశాంగ మంత్రి కానీ, లేదా దేశ రాయబారులు, దౌత్యవేత్తలు కానీ మాట్లాడాల్సిన అంశాలు, ఒక యోగా గురువు మాట్లాడటమేమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాబా రామ్ దేవ్ శనివారం చేసిన  ట్వీట్‌లో, ‘‘చైనా వాస్తవంగా అమానవీయ, అనైతిక చర్యకు పాల్పడింది, యావత్తు ప్రపంచాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టింది.
ఇందుకు రాజకీయంగా, ఆర్థికంగా బహిష్కరించడం ద్వారా చైనాను అంతర్జాతీయ సమాజం శిక్షించాలి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం దౌత్యపరమైన చొరవను తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
కరోనా వైరస్ మొట్టమొదటిసారి గత ఏడాది నవంబరులో చైనాలోని వూహన్ సిటీలో కనిపించింది. అమెరికా వంటి దేశాలు ఈ వైరస్ ప్రపంచానికి విస్తరించడానికి చైనాయే కారణమని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ క్లిష్ట సమయం లో బాబారాందేవ్ ట్వీట్ దేనికి సంకేతం, ఆధ్యాత్మిక, యోగా రంగాలలో పేరున్న అందరినీ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా రంగం లోకి దించటం ద్వారా, చైనా మీద భారత్ దౌత్య పరమైన ఒత్తిడి క్రమేపీ తీసుకు వస్తోందా, అనేది ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న.