విశాఖ తెలుగుదేశంలో ముసలం

 

వైజాగ్ లో చిన్నగా మొదలయిన తెలుగు తమ్ముళ్ళ గొడవ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు రాజీనామాతో తీవ్ర స్థాయికి చేరుకొంది. వైజాగ్ లో రెండు వర్గాలుగా చీలిపోయిన తెలుగుదేశం సభ్యులు పోటాపోటీగా సభలు పెట్టుకొని ఒకరిని ఒకరు దూషించుకొంటూన్నారు. అయ్యన్నపాత్రుడి వర్గానికి చెందిన 23మంది అనుచరులు పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసారు. వైజాగ్ లో ప్రముఖ కేంద్రమయిన గాజువాక తెలుగుదేశం పార్టీ విభాగానికి ఇన్-చార్జ్ కోన తాతారావు, శాసన సభ్యుడు రామకృష్ణ కూడా రాజీనామా చేసారు. అయ్యన్నపాత్రుడు స్వస్తలమయిన నర్సీపట్నంలో ఈ రోజు సాయంత్రం వారు సమావేశమయి తమ తదుపరి కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. అయ్యన్నపాత్రునికి మద్దతుగా మరి కొంతమంది శాసనసభ్యులు, కార్పొరేటర్ లు కూడా ఈ రోజు రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నారు.

 

మరో వైపు బండారు సత్యనారాయణ వర్గీయులు కూడా సమావేశాలు నిర్వహిస్తూ, పీల శ్రీనివాస రావు మరియు అయ్యన్న పాత్రుని వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా ఇన్-చార్జ్ సుజన చౌదరి రెండు వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నపటికీ, తమ అనుచరుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏమి లేదంటూ అయ్యన్నపాత్రుడు ఆయనతో మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం. నల్గొండలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొంటూ, పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమయిన సూచనలు చేస్తున్నారు. అయన అయ్యన్న పాత్రుడి రాజీనామాను తిరస్కరించారు.