అయోధ్య వివాదానికి ముగింపు... నవంబర్ 17లోపు తుది తీర్పు

దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో తుది వాదనలు ముగిశాయి. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని... నిర్మోహి అఖాడ, రాంలాల్‌ విరాజ్‌మని‌, సున్నీ వక్ఫ్‌ బోర్డుకు సమానంగా పంచుతూ...  అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ... దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం విచారణ జరిపింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. 2019 ఆగస్ట్ 6నుంచి అక్టోబర్ 16వరకు మొత్తం 40రోజులపాటు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వు చేసింది.

అయితే, చివరి రోజు సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. హిందువుల నమ్మకం ప్రకారం ఇది రామజన్మభూమిగా కొనసాగుతోందని, అలాగే రామాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని హిందూ వర్గమైన రాంలాలా విరాజ్‌మని తరపున న్యాయవాదులు వాదించారు. అనంతరం సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించిన లాయర్లు... బాబర్ వచ్చి మసీదును నిర్మించాక... ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగేవని ధర్మాసనానికి విన్నవించారు. ఈ పిటిషన్లతోపాటు పలు వ్యక్తిగత, హిందూసభ, వీహెచ్‌పీ తదితర పిటిషన్లపైనా వాదనలు జరిగాయి. అయితే, వాదనలు వినిపించేందుకు బుధవారం సాయంత్రం 5గంటల వరకు గడువిచ్చిన సీజేఐ.... గంట ముందే విచారణ పూర్తయినట్లు ప్రకటించారు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మూడ్రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు.

అయితే, వాదనల సందర్భంగా సుప్రీంలో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణలో భాగంగా సీజేఐతో ఇటు హిందూ, అటు ముస్లిం తరపు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. హిందూ మహాసభ తరపు లాయర్... ధర్మాసనం ముందుంచిన... అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని ముస్లింల తరపు లాయర్ చించేయడంతో.... రగడ జరిగింది. దాంతో సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాగైతే విచారణను మధ‌్యలోనే నిలిపివేస్తానని హెచ్చరించారు.

సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన కేసుల్లో ఇది రెండోది. 1972లో ప్రాథమిక హక్కులపై దాఖలైన పిటిషన్‌పై 68రోజులపాటు విచారణ జరగగా, 13మంది జడ్జిల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆ తర్వాత ఆధార్‌ కేసుపై 38 రోజులపాటు విచారణ జరిగింది. అయితే, అయోధ‌్య కేసుపై 40రోజులపాటు విచారణ జరగడంతో... సుప్రీం చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా రికార్డులకెక్కింది. మొత్తానికి వివాదాస్పద అయోధ్య భూమిపై వాదనలు ముగియడంతో... తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే, నెలరోజుల్లోపే తీర్పును వెలువరిస్తానని సీజేఐ ప్రకటించడం... అలాగే రంజన్ గొగోయ్... నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండటంతో... ఆలోపే... తీర్పు వెలువరించనున్నారు.