జ‌మాత్ స‌మావేశాలు ఎంత మంది జీవితాల్ని...

త‌బ్లీక్ జ‌మాత్‌కు చెందిన మూడు రోజుల ఇస్త‌మా ఈ నెల 13-15 ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్‌లో జ‌రిగింది. ఈ స‌మావేశంలో 75 దేశాల నుంచి ఎనిమిదివేల మంది వరకూ హాజరైనట్లుగా గుర్తించారు. ఇండోనేషియా.. మలేషియా.. సౌదీ.. కజకిస్థాన్ ఇలా చాలా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలా హాజరైన విదేశీయుల సంఖ్య ఏకంగా రెండు వేలు. మూడు రోజుల స‌మావేశాలు ముగిసిన‌ప్ప‌ట్టికీ ఇంకా మ‌ర్క‌జ్ భ‌వ‌నంలోని ఆరు అంతస్తుల డార్మటరీల్లో 280 మంది విదేశీయులు ఉన్నట్లుగా తేలింది. అక్కడున్న మొత్తం 300 మందికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా తేలింది. అనారోగ్యంగా ఉన్న 75 మందిని ఆదివారమే ఢిల్లీలో గుర్తించారు.

లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి ఒకేచోట వేల మంది ఎలా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. మూడు రోజుల ఇస్త‌మా జరిగిన స్థలం నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ను అనుకునే ఉండటం. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఇప్ప‌డు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్‌డౌన్ కార‌ణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు లేక ఇక్కడే ఉన్నారని మ‌ర్క‌జ్ భవనం ప్రతినిధి చెబుతున్నారు.