సిద్దూ కాన్వాయిపై రాళ్ళ దాడి

 

ప్రముఖ భారత మాజీ క్రికెటర్, భారతీయ జనతాపార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కాన్వాయి మీద రాళ్ళదాడి జరిగింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ భారతీయ జనతాపార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్దూ గురువారం నాడు జమ్ము వెళ్ళారు. అక్కడ సిద్దూ కాన్వాయి మీద కొంతమంది రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో కాన్వాయిలోని కార్ల అద్దాలన్నీ పగిలిపోయాయి. ఈ దాడిలో సిద్దూకి గాయాలు తగల్లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. కాశ్మీర్‌లో చివరి దశ పోలింగ్ శనివారం నాడు జరగనుంది. మంగళవారం నాడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా సిద్దూ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతపార్టీ ఎంపీగా మూడుసార్లు ఆయన విజయం సాధించారు. అయితే మొన్నటి ఎన్నికలలో మాత్రం ఆయన ఎన్నికల పొత్తులో భాగంగా తన స్థానాన్ని వదులుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన మరో స్థానం నుంచి పోటీ చేయలేదు.