ప్రభుత్వం కుప్పకూలినా కూలొచ్చు.! కేసీఆర్‌కు అశ్వద్ధామరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

 

తెలంగాణలో ఆర్టీసీ అలజడి కొనసాగుతోంది. అటు కార్మిక సంఘాలు... ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో...  ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. ఇక, ఆర్టీసీ సమ్మెపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుండటంతో ఇరువర్గాలూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, హైకోర్టు విచారణ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై మరోసారి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో రవాణా, ఆర్టీసీ, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌... హైకోర్టుకు సమర్పించాల్సిన నివేదిక, వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ నియమించేందుకు కసరత్తు చేశారు.

ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఇలాగుంటే, మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ కంటే కేసీఆర్ ఛరిష్మా ఉన్న నాయకుడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మొండి వైఖరి ఇలాగే కొనసాగితే.... ఎన్టీఆర్ హయాంలో జరిగిన 1995 తరహా రాజ్యాంగ సంక్షోభం వచ్చినా రావొచ్చన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే కుప్పకూలిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

మేధావుల మౌనం ప్రమాదకరమన్న అశ్వద్ధామరెడ్డి... ఇప్పటికైనా మంత్రులు హరీష్ రావు‌, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి నోరు విప్పాలని కోరారు. ఇక, పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారన్న అశ్వద్ధామరెడ్డి.... వాళ్లంతా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల బాధలను చూసి... పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఆదేశాలతో మీడియా ముందు విమర్శించినా... ఆ తర్వాత ఇంటికెళ్లి ఏడుస్తున్నారంటూ అశ్వద్ధామరెడ్డి చెప్పుకొచ్చారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడుతున్నారనే... తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అశ్వద్ధామరెడ్డి ఆరోపించారు.

సాధ్యంకాదన్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నామని, అలాంటిది ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎందుకు కాదో తేల్చుకుంటామని అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లే... తమ డిమాండ్లును కూడా సాధించుకుంటామన్నారు. ప్రజాప్రతిఘటన మొదలైతే ఎవరూ ఆపలేరంటూ కేసీఆర్ సర్కారును హెచ్చరించిన అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకపోతే 1995 తరహా సంక్షోభం ఎప్పుడైనా రావొచ్చని, ఏదైనా జరగొచ్చని వార్నింగ్ ఇచ్చారు.