ఎట్టకేలకు రెండో సీఎం ఎవరో తేలిపోయింది

 

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో సత్తా చాటింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో సీఎంలు ఎవరు? అంటూ ఇటు ప్రజలు, అటు పార్టీలో విపరీతమైన చర్చలు జరిగాయి. ఎట్టకేలకు రెండు రాష్ట్రాల సీఎంల మీద స్పష్టత వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ కు సీనియర్ నేత కమల్ నాథ్ ను సీఎంగా ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా రాజస్థాన్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చింది. రాజస్థాన్‌ సీఎంగా సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎంగా సచిన్‌ పైలట్‌ను ఎంపిక చేశారు. రాజస్థాన్‌ సీఎం పదవికి గహ్లోత్‌తో పాటు సచిన్‌ పైలట్‌ కూడా పోటీపడ్డారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీ గత మూడు రోజులుగా తర్జనభర్జన పడింది. విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం గహ్లోత్‌ పేరును ఖరారు చేశారు. పైలట్‌ డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజస్థాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా కొనసాగనున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎంపికపై అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పదవి కోసం టీఎస్‌ సింగ్‌దేవ్‌, భూపేశ్‌ పటేల్‌ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై త్వరలోనే పార్టీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.