మరోసారి బొబ్బిలి యుద్ధం ?

 

వంచనకు.. వీరత్వానికి మధ్య జరిగిన యుద్ధం అది. విదేశీయులతో చేతులు కలిపి స్వదేశీ రాజ్యాలను కబళించే కుట్రకు సాక్ష్యం ఆ రణరంగం. బొబ్బిలి యుద్ధం ఒక చరిత్ర. 1757 జనవరిలో ఫ్రెంచ్ సేనాని బుస్సీతో కలిసి బొబ్బిలిపై పోరుకు దిగారు విజయనగర రాజులు. అత్యంత బలమైన విజయనగర సైన్యం, ఫ్రెంచ్ సేనలతో పోరాడి ఓడిపోయారు బొబ్బిలి సంస్థానాధీశులు. బొబ్బిలి జమీందారు రంగారావు బావమరిది తాండ్రపాపారాయుడు విజయనగర రాజును అంతమొందించాడు. పౌరుషానికి, పోరాటానికీ ఉదాహరణగా నిలిచిన వీర బొబ్బిలి యుద్ధం మరోసారి జరగబోతోంది.

 

నాటి బొబ్బిలి యుద్ధం బొబ్బిలిలో జరిగితే.. నేటి యుద్ధం విజయనగరంలో జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన నేపధ్యంలో .. బొబ్బిలి పార్లమెంట్ స్థానం మాయమై విజయనగరంలో విలీనమైంది. ఎన్నికల నగారా మోగిన వేళ వీరబొబ్బిలి సమరానికి వేదిక కానుంది విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం.

 

విజయనగర రాజుల వారసుడు, ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ అభ్యర్ధిగా విజయనగరం పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తెలుగుదేశం సీనియర్ నేతగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న అశోక్ ఎంపీగా పోటీ చేస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

 

ఇదే స్థానం నుంచి బొబ్బిలి సంస్థానాధీశుల వారసుడు అర్వీఎస్ కె రంగారావు (బేబీ నాయన) జగన్ పార్టీ తరపున బరిలో దిగనున్నారు. ఈయన గతంలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. రెండున్నర శతాబ్దాల క్రితం రాజరికంలో ఆధిపత్యం కోసం పోరాడిన విజయనగరం రాజ వంశీయులు.. పౌరుషంతో ఎదురొడ్డిన బొబ్బిలి సంస్థానాధీశుల వారసులు.. ఇన్నేళ్ళ తరువాత ప్రజాస్వామ్య క్షేత్రంలో యుద్దానికి సిద్ధమవుతున్నారు.

 

కాంగ్రెస్ ను వీడి జగన్ పార్టీలో చేరిన బొబ్బిలి రాజులు.. తమ తరతరాల క్రిందటి శత్రువైన విజయనగర రాజ్య వంశీయుడు అశోక్ గజపతి రాజుతో తలపడుతున్నారు. బ్యాలెట్ బాక్సింగ్ లో ఏ రాజు గెలిచినా అది మరో చరిత్ర అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఈ ఇద్దరు రాజులు యుద్ద వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. నాటి బొబ్బిలి యుద్ధాన్ని పుస్తకాల్లో చడుకోవడం, సినిమాలు చూసి తెలుసుకున్న నేటి తరానికి.. విజయనగరం పార్లమెంటు కేంద్రంగా మరోసారి అభినవ బొబ్బిలి యుద్ధాన్ని చూసే అవకాశం దక్కనుంది.

 

వీర బొబ్బిలి యుద్దంలో కొసమెరుపు ఏమిటంటే సిట్టింగ్ ఎంపీ, పీసీసీ చీఫ్ బొత్స భార్య కూడా ప్రేక్షకురాలిగానే మిగిలిపోవచ్చంటున్నారు విజయనగరం మరియు బొబ్బిలి ఓటర్లు.