కూకట్‌పల్లి బరిలో అశోక్‌బాబు?!

 

 

 

జేపీ పప్పులు ఇక కేపీలో ఉడకవని అర్థమైపోతోంది. గత ఎన్నికలలో జయప్రకాష్ నారాయణ్‌ని ప్రేమగా గెలిపించిన కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకరోజు రాష్ట్ర విభజనకు అనుకూలంగా, మరోరోజు వ్యతిరేకంగా మాట్లాడే జేపీ కేపీ ప్రజల మనసులను బాధపెట్టారు. రీసెంట్‌గా అసెంబ్లీలో విభజన బిల్లు చర్చలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా జేపీ మాట్లాడిన తీరు స్థానికంగా మెజారిటీగా వుండే సీమాంధ్ర ప్రజల మనసులు విరగ్గొట్టేసింది. రాబోయే ఎన్నికలలో జేపీకి తగిన పాఠం చెప్పాలని కూకట్‌పల్లి ఓటర్లు భావిస్తున్నారు.

 

హైదరాబాద్‌లో వున్న సీమాంధ్ర ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీలో వినిపించాల్సిన జయప్రకాష్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని కూకట్‌పల్లి ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జేపీ తన రాజకీయ భవిష్యత్తును కూకట్‌పల్లిలోనే వెతుక్కుంటూ వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఈమధ్య లోక్‌సత్తా విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికలలోనూ గెలవాలని భావిస్తున్న కేపీ కలలు కల్లలయ్యే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



ఆమ్ ఆద్మీ పార్టీలో కలవటానికి జేపీ చూపిస్తున్న ఉత్సాహం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారి మీద ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలో అట్టర్ ఫ్లాప్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టు కట్టడానికి జేపీ చూపిస్తున్న చొరవని ఎవరూ హర్షించడం లేదు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి సీటు మీద రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని నిలిపాయి. సమైక్య ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్న పరుచూరి అశోక్‌బాబుని ఈ నియోజకవర్గం నుంచి జేపీకి పోటీగా నిలపాలనే ఆలోచన అన్ని పార్టీల్లోనూ మొగ్గతొడిగింది. దీనికి సంబంధించి అశోక్‌బాబును ఒప్పించడానికి, తమ పార్టీవైపు అశోక్‌బాబును లాక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.



ప్రస్తుతానికి అశోక్‌బాబు రాజకీయాల్లో చేరనని చెబుతున్నప్పటికీ ఎన్నికల సమయానికి అశోక్‌బాబును జేపీ మీద పోటీకి ఆయన్ని ఒప్పించవచ్చన్న ఆశావాదం రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. దీనికితోడు ఈమధ్య కాలంలో జేపీని కూకట్‌పల్లిలో ఓడించే అభ్యర్థిని నిలబెడతామని అశోక్‌బాబు ప్రకటించారు. ఆ అభ్యర్థి వేరేవెరో ఎందుకు అవ్వాలి.. అశోక్‌బాబే ఎందుకు కాకూడదన్న ఆలోచనలో రాజకీయ వర్గాలు వున్నాయి.