నాకూ ముఖ్యమంత్రి కావాలనే కోరికలేదు: అసదుద్దీన్

 

నిన్న జానారెడ్డి, మొన్న బొత్స సత్యనారాయణ అంతకు మునుపు లెక్కలేనంత మంది ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు స్వయంగా ప్రకటించుకొన్నారు. ఇప్పుడు తాజాగా మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ‘తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరికలేదు’ అనే చిన్న స్టేట్మెంటుతో తానూ కూడా పదవికి ముఖ్యమంత్రి అర్హుడినేనని, నేడు కాకపోయినా రేపయినా ముఖ్యమంత్రి అవ్వాలనే మనసులో కోరికను బయటపెట్టారు.

 

ఇటీవల ఒక ప్రైవేట్ టీవీ చానల్ వారితో ఇంటర్వ్యు లో పాల్గొన్నఆయన, రాష్ట్రం రెండుగా విడిపోతే భారతీయ జనతా పార్టీ బలపడుతుందని తాము భావించబట్టే, సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతూ అప్పటి పరిస్థితులను బట్టి ఎవరితో పొత్తులు పెట్టుకొవాలో నిర్నయించుకొంటామని అన్నారు. ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ప్రత్యేక మిత్రత్వం కానీ, శత్రుత్వంగానీ లేదని, మిగిలిన పార్టీల మాదిరిగానే దానితోను వ్యవహరిస్తామని అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ఆయన ఒక సమర్డుడయిన నాయకుడని, గత ఎన్నికలలో భారతీయ పార్టీ సారద్యం వహిస్తున్న యన్.డీ.యే.కూటమి వైపు ఆయన మొగ్గు చూపిన కారణంగానే తెలుగు దేశం పార్టీకి తాము దూరమవ్వల్సివచ్చిందని అన్నారు. ఒకవేళ చంద్రబాబు నుండి సరయినరీతిలో స్పందన వస్తే, రానున్న ఎన్నికలలో పోత్తులకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆయన సూచించారు.

 

రాష్ట్రంలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును స్వంతం చేసుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకయినా మజ్లిస్ పార్టీతో పొత్తులు తప్పవు. వైయస్స్సార్ కాంగ్రెస్ మజ్లిస్ తో స్నేహం కోసం చాల కాలంగానే ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ ఇస్తున్న ఓపెన్ ఆఫర్ను ఎవరు ముందుగా స్వీకరిస్తారో వేచి చూడాలి.