తెరాస, మజ్లిస్‌ రహస్య పొత్తు

 

తెరాస, మజ్లిస్ పార్టీలు రహస్య పొత్తు పెట్టుకున్నాయని, మజిల్స్ అభ్యర్థులు బరిలో ఉన్న చోట తెరాస బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా తమ మద్దతు తెరాసకే అని తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహ్మత్‌నగర్‌ డివిజన్‌ హబీబ్‌ఫాతిమా నగర్‌, సంజయ్‌నగర్‌ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో భాజపా, ప్రజాకూటమికి బుద్ధి చెప్పాలని, ముస్లింల అభివృద్ధికి పాటుపడుతున్న తెరాసకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 236 మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. ‘లేని మామ కన్నా.. గుడ్డి మామ నయం’ అన్నట్లు తెరాసకు మద్దతిస్తున్నామని, స్టీరింగ్‌ మన చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎంఐఎం 8 స్థానాల్లో పోటీ చేస్తోందని, మజ్లిస్‌ బరిలో లేనిచోట తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తీరు ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.