టీఆర్ఎస్ కు ఎవరి మద్దతు అవసరం లేదు

 

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆరే మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని జోస్యం చెప్పారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. ఈరోజు మధ్యాహ్నం బుల్లెట్‌పై ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయన... దాదాపు 4 గంటల పాటు సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఒవైసీ... తెలంగాణలో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారు. పూర్తి మెజార్టీతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని,ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మరో సారి కేసీఆర్‌ను ఆశీర్వదించనున్నారని ఒవైసీ తెలిపారు. ఈ భేటీలో తామిద్దరం ఎక్కువగా జాతీయ రాజకీయాల గురించే చర్చించామని స్పష్టంచేశారు.

ఎనిమిది మంది ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. తామెప్పుడూ తెరాసకు మద్దతుగానే ఉంటామని స్పష్టంచేశారు. తెరాస విజయం పట్ల కేసీఆర్‌ కూడా విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. బీజేపీకి సీట్లు తగ్గుతాయని... ఆ పార్టీ బలం రేపు తేలిపోనుందన్న అసదుద్దీన్... రేపు మరోసార సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు. భేటీకి ముందు "ఇవాళ 1.30 గంటలకు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి  కేసీఆర్‌ తో భేటీ అవుతున్నాను. అల్లా దయతో కేసీఆర్‌ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగాలి. మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్‌తోనే ఉంటుంది. జాతి నిర్మాణంలో ఇదే తమ మొదటి అడుగు' అని అసద్‌ ట్వీట్‌ చేశారు.