ఢిల్లీ పోలింగ్ శాతంపై కేజ్రీవాల్ అనుమానాలు.. నిజంగానే కుట్ర జరిగిందా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాన్ని తేల్చింది. మొత్తం మీద 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది. అయితే ఈ ఆలస్యంపై ఆమాద్మీ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంత ఆలస్యంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించడం వెనుక మతలబు ఏంటని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. అక్రమంగా ఈవీఎం లను తరలించి ఉంటారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసిన ఒక రోజు తరువాత ఓటింగ్ శాతాన్ని ప్రకటించడంపై ఆమాద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ తీరు తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్నికల సంఘం అధికారులు నిద్రపోతున్నారా? పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఓటింగ్ శాతాన్ని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈవీఎం లు ట్యాంపర్ చేసే కుట్ర జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా ఆప్ నేతలు పోస్టు చేసారు. బాబున పూర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో కొన్ని ఈవీఎం లను వాడకుండా పక్కన పెట్టినట్లు తాము గుర్తించామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. 

ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఆప్ నేతల ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. ఖచ్చితమైన సమాచారం అందించడం కోసమే ఆలస్యం జరిగిందని కొన్ని చోట్ల పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూడా ఓటర్లు క్యూలో నిల్చోవడం వల్ల పోలింగ్ శాతంపై క్లారిటీ రాలేదన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల 17 నిమిషాలకు 61.43 శాతం పోలింగ్ జరిగినట్లు తాము యాప్ లో అప్ డేట్ చేసినట్టు ఎన్నికల సంఘం అధికారి రణవీర్ సింగ్ చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు ఈసీకి సంబంధించిన యాప్ లో అప్ డేట్ చేస్తూ వచ్చారు. కాని, వాస్తవ పరిస్థితుల కంటే అందులో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. మొత్తం డేటా ఎన్నికల సంఘానికి వచ్చి దానిని అనలైజ్ చేసేసరికి ఆలస్యమైందని అందుకే పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. 

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి దాదాపు 5 శాతం పోలింగ్ తగ్గింది. ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలకు పోలింగ్ జరగ్గా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా కేజ్రివాల్ సీఎంగా పగ్గాలు చేపడతారని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నెల పదకొండున అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.