కాంగ్రెస్ నేతలను కసితో ఓడించాలి: రఘువీర రెడ్డి

 

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీలో పదవులు, హోదా అన్నీ అనుభవించి, ఇబ్బడిముబ్బడిగా డబ్బు, ఆస్తులు అన్నీ సంపాదించుకొని చివరికి పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళ్లిపోయిన వారందరికీ ప్రజలు కసితో, చాలా కసితో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. లక్షలాది ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి రెండున్నర నెలల పాటు ఏకధాటిగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఉద్యమాలు చేసినప్పటికీ, వారి పట్ల కనీసం మానవతా దృక్పధంతోనయినా స్పందన చూపకపోగా, డిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని వారి ఉద్యమాలను అవహేళన చేసి, ప్రజలను ఘోరంగా అవమానించారు కాంగ్రెస్ నేతలు.

 

ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా పార్లమెంటు పరువు మంటగలిపి మరీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నుండి దానికి చెందిన కొందరు నేతలు బయటకి వెళ్ళిపోతే దానివల్ల ప్రజలకు ఏమి నష్టం? వారిని కసితో ఓడించాల్సిన అవసరం ప్రజలకేముంది? స్వంత పార్టీ నేతలనే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, సదరు నేతలది కూడా స్వచ్చమయిన కాంగ్రెస్ డీ.యన్.ఏ. కనుకనే వారు కూడా పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు. పైగా వారందరూ పార్టీలో ఉంటూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బు, ఆస్తులు కూడబెట్టుకొన్నారని స్వయంగా రఘువీర రెడ్డి చెప్పడం చూస్తే కాంగ్రెస్ నేతలందరూ కలిసి ఇంతకాలంగా వెలగబెడుతున్న గొప్ప ఘనకార్యం ఏమిటో ఆయనే స్వయంగా ప్రకటించుకొన్నట్లుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం, దానిని విడిచిపోతున్న నేతల కోసం ప్రజలెందుకు ఆలోచించాలి?

 

కానీ పీసీసీ అధ్యక్షుడు అంతటి వాడే స్వయంగా తమ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ ఓడించమని పిలుపునిస్తుంటే ప్రజలు ఆయన ముచ్చట మాత్రం ఎందుకు కాదనాలి ప్రజలు కూడా అందుకే ఎదురు చూస్తున్నారు గనుక కాంగ్రెస్ పార్టీని, కండువాలు మార్చి ప్రజలను ఏమార్చడానికి వస్తున్న సదరు కాంగ్రెస్ నేతలందరినీ ఏ పార్టీ కలుగుల్లో ఎలుకల్లా దాకొన్నాకూడా వారిని ప్రజలు గుర్తుపెట్టుకొని మరీ ఓడించిననాడే వారు మళ్ళీ ఇటువంటి దుస్సాహసం చేసేందుకు కూడా ఎప్పుడు ఆలోచన చేయరు. అలాకాదని పార్టీల జెండాలను, సదరు అధినేతల మాటలను, వారి కులాలాను చూసి మళ్ళీ కాంగ్రెస్ నేతలకే ప్రజలు ఓటేస్తే వారు ఏదో ఒకరోజు మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొని మళ్ళీ తమను గుడ్డిగా నమ్మిఓటేసిన ప్రజలను అపహాస్యం చేయడం తధ్యం. అందువల్ల రఘువీర రెడ్డి కోరినట్లే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ వారు ఏ పార్టీలో ఉన్నపటికీ ఓడించి ఋణం తీర్చుకోవలసి ఉంది.